Bharat Jodo Nyay Yatra Rahul Gandhi :తాను కేసులకు బెదిరిపోనని, మరిన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేసుకోవాలని అసోం పోలీసులకు సవాల్ విసిరారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. తనతో సహా కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్ సహా మరికొందరిపై మంగళవారం అసోం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై రాహుల్ తీవ్రంగా స్పందించారు. బార్పేటలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై రాహుల్ విమర్శలు గుప్పించారు. దేశంలోని అత్యంత అవినీతి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అని పేర్కొన్నారు. అసోంలో భయం, ద్వేషాన్ని ఆయన వ్యాపింపజేస్తున్నారని అన్నారు రాహుల్. అంతటితో ఆగకుండా ప్రజల దృష్టి మరల్చి వారి భూములు, డబ్బును దోచుకుంటున్నారని విమర్శించారు.
'కేసులతో నన్ను భయపెట్టగలనన్న ఆలోచన హిమంత బిశ్వశర్మకు ఎలా వచ్చిందో నాకు తెలియదు. వీలైనన్ని కేసులు పెట్టండి. మరో 25 కేసులు పెట్టండి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నన్ను బెదిరించలేవు. బీజేపీ, ఆస్‌ఎస్ఎస్ అసోం భాష, సంస్కృతి, చరిత్రను తుడిచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. వారు అసోంను నాగ్‌పుర్(ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం) నుంచి నడపాలనుకుంటున్నారు. కానీ మేము దానిని అనుమతించం. అసోంలో అవినీతి పరంపంర కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మల హృదయాలు ద్వేషంతో నిండిపోయాయి. కాజీరంగా నేషనల్ పార్క్‌లో కూడా అసోం సీఎం హిమంత బిశ్వశర్మకు భూమి ఉందని తెలిస్తే ఆశ్చర్యపోతారు."
-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత