Atul Subhash Wife Arrested :దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు టెకీ అతుల్ సుభాశ్ ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. అతుల్ భార్య నిఖితా సింఘానియాను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు ఆమె తల్లి నిషా, సోదరుడు అనురాగ్‌లను ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో అదుపులోకి తీసుకొన్నట్లు బెంగళూరు వైట్ ఫీల్డ్ డివిజన్ డీసీపీ శివకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
భార్య వేధింపులు తాళలేక బెంగుళూరు టెకీ ఆత్మహత్య చేసుకొన్నా ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బెంగళూరులోని ఓ ప్రవేటు సంస్థల జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న అతుల్ సుభాశ్ డిసెంబర్ 9న తన అపార్ట్మెంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 24 పేజీల ఆత్మహత్య లేఖ, దాదాపు గంటన్నర వీడియో అతుల్ రికార్డ్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో తాను అనుభవిస్తున్న మానసిక క్షోభకు సంబంధించి రాసిన లేఖను ఇ-మెయిల్ ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, తన కార్యాలయం అధికారులు, సిబ్బంది, కుటుంబసభ్యులకు పంపించారు. అందులో "నేను సంపాదించే డబ్బు నా శత్రువులను మరింత బలోపేతం చేస్తోంది. వారు దానిని వాడుకొనే నన్ను నాశనం చేస్తున్నారు. ఇది ఒక విష వలయంలా మారింది. అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను" అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు అతుల్.
'అప్పటివరకు నా కొడుకు అస్తికలు నిమజ్జనం చేయను'
నిఖితతో పాటు ఆమె కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో- తన కుమారుడిని హింసించిన వారిపై కఠిన శిక్ష విధించాలని అతుల్ తండ్రి డిమాండ్ చేశారు. వారికి శిక్ష పడితేనే తన కుమారుడి ఆత్మ శాంతిస్తుందని, న్యాయం జరుగుతుందని చెప్పారు. అతుల్‌కు న్యాయం జరిగే వరకు అతడి అస్తికలు నిమజ్జనం చేయబోనని తెలిపారు.
అంతకుముందు, తన కుమారుడి ఆత్మహత్యపై అతుల్ తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అతడిపై చాలా కేసులు ఫైల్ అయిన తర్వాత అతుల్ కుంగిపోయాడని అన్నాడు. "అవినీతి గురించి అతుల్ ఎప్పుడూ చెబుతుండేవాడు. నిజాయితీగా దానిపై పోరాటం చేస్తానని చెబుతుండేవాడు. కానీ కేసుల కారణంగా చాలా కుంగిపోయాడు. అయినా తన మనో వేదన గురించి ఎవరికీ ఏం చెప్పలేదు." అని అతుల్ తండ్రి తెలిపాడు.
'నన్ను గొడ్డులా భావించేవాడు'
సుభాష్ కుటుంబంపై అతడి భార్య నిఖితా సింఘానియా కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. తన అత్త కట్నం కోసం వేధించినట్లు చెప్పింది. తన భర్త మద్యం తాగి వచ్చి తను కొట్టేవాడని ఆరోపించింది. 'అతుల్ నన్ను ఒక పశువులా చూసేవాడు. నన్ను బెదిరించి జీతం మొత్తం తన ఖాతాలోకి బదలాయించుకొనేవాడు. అత్తగారి వేధింపుల కారణంగా నా తండ్రి ఆరోగ్యం దెబ్బతిని 2019లో మరణించారు" అని నిఖిత చెప్పింది.