Bengaluru Building Collapsed :కర్ణాటకలోనిబెంగళూరులో నిర్మాణ దశలో ఉన్న ఆరంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ప్రమాద సమయంలో 20 మందికి పైగా కార్మికులు అందులో ఉండగా, ఇప్పటి వరకు 14 మంది కార్మికులను పోలీసులు, స్థానికులు, విపత్తు నిర్వహణ దళం సిబ్బంది రక్షించారు. ఈ ఘటనలో బాధితులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, బెంగళూరులోని బాబూసాపాళ్యలో నిర్మాణ దశలో ఉన్న ఓ భవనం మంగళవారం సాయంత్రం కుప్పకూలింది. దీంతో భవనం కింద దాదాపు 20 మంది కార్మికులు చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న ఇతర కార్మికులను రక్షించేందుకు హెణ్ణూరు ఠాణా పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. భవంతి శిథిలాలు భారీ పరిమాణంలో ఉండటం వల్ల వేగంగా పనులు కొనసాగించలేని పరిస్థితి నెలకొంది.
బెంగళూరులోని పలు ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామువరకు అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిశాయి. వరద తాకి యలహంక కేంద్రీయ విహార్ ఆవరణలో అలారం వ్యవస్థ ఉన్న కార్లన్నీ ఒక్కసారిగా మోగడం ప్రారంభించాయి. సెల్లార్ లేని భవంతుల్లో దిగువ అంతస్తుల్లో ఉన్నవారు అప్రమత్తమయ్యేలోగానే వరద చుట్టుముట్టింది. ఇక్కడ ఉంటున్న వారిని మంగళవారం ఉదయం నుంచి యుద్ధ ప్రాతిపదికన బయటకు తీసుకువచ్చారు.
వర్షాల ధాటికి కుప్పకూలిన భవనం (ETV bharat) అన్నాచెల్లెళ్లు మృతి
నీరు తెచ్చేందుకు కెంగేరి చెరువులో దిగిన చెల్లెలు మహాలక్ష్మీ(11) మునిగిపోతోందని గుర్తించిన సోదరుడు శ్రీనివాస్ అలియాస్ జాన్సీ(13) నీటిలోదిగి ఇక్కట్లలో చిక్కారు. ఆ ఇద్దరూ చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన కెంగేరి పోలీసుఠాణా పరిధిలో సోమవారం సాయంత్రం జరింగింది.. మృతుల్లో ఒక్కరైన శ్రీనివాస్ మృత దేహాన్ని మంగళవారం ఉదయం అగ్నిమాపక సిబ్బంది వెలికితీశారు. మహాలక్ష్మీ మృతదేహం కోసం గాలిస్తున్నారు. నీటిలో కనిపించే కెమెరాల సాయంతో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరిద్దరూ పారిశుద్ధ్య కార్మికురాలు జయమ్మ కుటుంబీకులుగా గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే సోమవారం సాయంత్రం ఆరుగంటల నుంచి అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. వర్షం కురుస్తుండటం, చీకటిపడటం వల్ల గాలింపు చర్యలు నిలిపి ఉదయం నుంచి కొనసాగిస్తున్నారు.