Banana Leaves Demand In Bengaluru : కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో గత కొద్దిరోజులుగా నీటి సంక్షోభం నెలకొంది. సరిపడా నీరు లేక నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు బెంగళూరులో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే తాగునీటి సమస్యతో బాధపడుతున్న నగరవాసులకు మరో కష్టం వచ్చింది. భోజనానికి వినియోగించే అరటి ఆకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొన్ని చోట్ల సరఫరా తగ్గి అరటి ఆకుల కొరత కూడా ఏర్పడింది.
తగ్గిన స్టీల్ ప్లేట్ల్ వాడకం
బెంగళూరులోని పలు ప్రాంతాల్లో నీటి కొరత కారణంగా కొన్ని హోటళ్లు స్టీలు ప్లేట్లకు బదులుగా అరటి ఆకులను వినియోగిస్తున్నాయి. అయితే స్టీల్ ప్లేట్ల వినియోగం తగ్గి, అరటి ఆకు వాడకం పెరిగింది. దీంతో హోటల్ వ్యాపారులు, వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
నీటి కొరతతో ఆకులకు డిమాండ్
నగరంలో నీటి సమస్య తలెత్తడం వల్ల నీటి ట్యాంకర్ల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. దీంతో కొందరు ప్రజలు నీటి వినియోగాన్ని తగ్గించుకునేందుకు డిస్పోజబుల్ ప్లేట్లు, గ్లాస్‌లను వాడుతున్నారు. సంప్రదాయ పద్ధతిలో భోజనం, టిఫిన్ చేయాలనుకున్నవారు అరటి ఆకులను వాడుతున్నారు. దీంతో ఒక్కసారిగా బెంగళూరులో అరటి ఆకులకు డిమాండ్ పెరిగింది. అదే సమయంలో అరటి ఆకుల సరఫరా సైతం తగ్గింది. దీంతో అరటి ఆకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.