Balak Ram Idol On Pencil Lead :పెన్సిల్ కొనపై అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని అద్భుతంగా మలిచి భళా అనిపించుకుంటున్నాడు కళాకారుడు జీవన్ జాదవ్. మైక్రోస్కోప్ సాయంతో రామయ్య విగ్రహాన్ని పెన్సిల్ కొనపై తీర్చిదిద్దాడు. 1.5 సెంటిమీటర్ల పరిమాణంలో చెక్కిన ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిచిన్నదని చెబుతున్నాడు మహారాష్ట్ర నాశిక్ జిల్లాకు చెందిన జీవన్ జాదవ్. ఇప్పటికే పెన్సిల్ కొనలపై ఎన్నో అద్భుతమైన కళాఖండాలను చెక్కి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌తో పాటు అనేక అవార్డులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో డిజిటల్ మార్కెటింగ్ విభాగంలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
"నాకు చిన్నప్పటి నుంచే పెయింటింగ్‌పై ఆసక్తి ఉండేది. స్కూల్లో ఉన్నప్పుడు చాక్పీస్లపై చిన్న చిన్న కళాఖండాలను చెక్కేవాడిని. కానీ, ఆ తర్వాత దీనిని సాధన చేయడంలో నిర్లక్ష్యం చేశాను. నేను ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు నా స్నేహితుడు ఒకరు పెన్సిల్ కొనపై చెక్కిన బొమ్మలకు సంబంధించిన వీడియోను పంపించాడు. అది చూసిన వెంటనే నాలోని కళాకారుడు మళ్లీ నిద్రలేచాడు. దీంతో ఈ కళలో నేను కూడా ఏదో ఒకటి సాధించాలని నిర్ణయించుకున్నాను. అలా పెన్సిల్ కొనపై చిన్నపాటి విగ్రహాలు చెక్కడం ప్రారంభించాను. నాలాగే ప్రతిఒక్కరూ తమ అభిరుచులకు సానపెట్టాలి. వాటిని కొనసాగించాలి. నా ఈ కళ ప్రపంచానికి తెలిసినందుకు ఆనందంగా ఉంది. దీంతో నా ప్రాంతానికి పేరొచ్చింది"
--జీవన్ జాదవ్, పెన్సిల్ ఆర్టిస్ట్
వందకుపైగా విగ్రహాలు
జీవన్ జాదవ్ ఇప్పటివరకు క్రీడాకారులు, రాజకీయ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధులు సహా భారతీయ సంస్కృతి ప్రతిబింబిచేలా దేవతామూర్తులు బొమ్మలను పెన్సిల్ కొనలపై చెక్కాడు. ఇతడు ప్రధాని నరేంద్ర మోదీ, ఛత్రపతి శివాజీ మహారాజ్, మహాత్మా గాంధీ, ఏపీజే అబ్దుల్ కలాం, లాల్బాగ్ కా రాజా (గణేశ్), లక్ష్మీదేవీ, మహేంద్ర సింగ్ ధోనీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మైకెల్ జాక్సన్, విఠల్ మూర్తి, నానా పటేకర్ వంటి వందకు పైగా అద్భుతమైన విగ్రహాలను రూపొందించాడు.
2019లో 'గొలుసుకు గిన్నిస్'
ఇవి కాకుండా ఒకే పెన్సిల్‌పై ఆంగ్ల అక్షరాలు A నుంచి Z వరకు చెక్కాడు జీవన్. అంతేకాకుండా ఒక్క పెన్సిల్‌తో 93 లింక్‌లు కలిగిన ఓ గొలుసును కూడా తయారు చేశాడు. ఇందుకుగాను అతడికి 2019లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఇక మహారాష్ట్రలోని ప్రసిద్ధ దేవాలయంలోని శ్రీమంత్ దగ్దుషేత్ హల్వాయి గణపతి మూర్తిని కూడా పెన్సిల్ కొనపై చెక్కాడు. ఇది ప్రపంచంలోనే అతి చిన్న దగ్దుషేత్ హల్వాయి గణేశ్ విగ్రహంగా రికార్డులోకెక్కింది.