Badrinath Opening Date 2024: ఉత్తరాఖండ్‌లో బద్రీనాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఆరు నెలల తర్వాత వేద మంత్రోచ్చరణ, డప్పు, నాదస్వర వాయిద్వాల మధ్య బద్రీనాథ్ ఆలయ తలుపులను పూజారులు తెరిచారు. ఈ సందర్భంగా ఆలయాన్ని అందంగా అలంకరించారు. ఆలయ తలుపులు తెరవడం వల్ల చార్‌ధామ్ యాత్ర అధికారికంగా ప్రారంభమైంది. చార్‌ధామ్ యాత్రలో బద్రీనాథ్, కేదార్ నాథ్, యుమునోత్రి, గంగోత్రి ఆలయాలను భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరుచుకోగానే ఆలయంలో లోపలికి భక్తులు పోటెత్తారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా భారీగా భక్తులు తరలి వచ్చారు. కేదార్నాథ్, యుమునోత్రి, గంగోత్రి ఆలయాల తలుపులను అక్షయ తృతీయ సందర్భంగా శుక్రవారమే తెరిచారు.
భక్తుల నినాదాలతో తలుపులు ఓపెన్
ఉదయం నాలుగు గంటల నుంచే ఆలయ తలుపు తెరిచే కార్యక్రమం ప్రారంభమైంది. రెండు గంటల పూజల అనంతరం ఆలయ కమిటీ అధికారులు, పాలకమండలి కలిసి భక్తుల సమక్షంలో ఉదయం 6 గంటలకు తలుపులు తెరిచారు. ఆలయానికి వచ్చిన భక్తులు బద్రీ విశాల్ లాల్ కీ జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 15 క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని అలంకరించారు. మరోవైపు ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మీత్ సింగ్ బద్రీనాథుడి దర్శించుకునేందుకు ఆలయానికి వచ్చారు.
సీఎం శుభాకాంక్షలు
ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి ప్రజలకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. వేద మంత్రోచ్ఛారణలతో ఆలయ తలుపు తెరుచుకున్నాయని, చార్ ధామ్ యాత్రలో భాగంగా వస్తున్న భక్తులందరికీ హృదయపూర్వక స్వాగతం అని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నదే మా ప్రయత్నమని అన్నారు. ప్రారంభ రోజుల్లో ఎక్కువమంది వస్తుంటారని, అందుకే భక్తులు తమ బుకింగ్ వివరాలు వాతావరణ గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నాకే ప్రయాణం ప్రారంభించాలని తెలిపారు.