Badaun Encounter Case:ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదాయూ జిల్లాలో ఘోరం జరిగింది. ఓ సెలూన్ షాపు యజమాని సాజిద్, ఇద్దరు చిన్నారులను అతికిరాతకంగా గొడ్డలితో నరికిచంపాడు. మరో పిల్లాడిని చంపబోగా ఆ బాలుడు త్రుటిలో తప్పించుకున్నాడు. అనంతరం ఆ బార్బర్‌ను పోలీసులు ఎన్కౌంటర్ చేసి కాల్చి చంపారు.
వణికిపోయిన స్థానికులు
ఇటీవలే బదాయులో బార్బర్ షాప్ తెరిచిన సాజిద్, ఇద్దరు సోదరులను పొట్టనపెట్టుకోవడం స్థానికంగా సంచలనం రేపింది. 12 ఏళ్ల ఆయుష్, 8 ఏళ్ల హనీ, 10 ఏళ్ల యువరాజ్‌పై సాజిద్ చేశాడు. వారిని భవనంపైకి తీసుకెళ్లి ఇద్దరిని గొడ్డలితో నరికిచంపాడు. ఈ దాడిలో గాయపడ్డ యువ్‌రాజ్ త్రుటిలో తప్పించుకున్నాడు. వీరు ముగ్గురూ సోదరులని జిల్లా మేజిస్ట్రేట్ మనోజ్ కుమార్ తెలిపారు. ఈ దారుణం మండి పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే జరగడం సంచలనం రేపింది.
అయితే, హత్యలు జరిగిన కొన్ని గంటల తర్వాత 22 ఏళ్ల సాజిద్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడని బరేలీ రేంజ్ ఐజీ ఆర్‌కె సింగ్ తెలిపారు. పిల్లలను చంపిన తర్వాత సాజిద్ ఇంటి నుంచి పారిపోయాడని చెప్పారు. పోలీసులకు ఎదురుపడ్డప్పుడు కూడా రక్తంతో తడిసిన దుస్తులనే ధరించి ఉన్నాడని వివరించారు. పోలీసు బృందం నిందితుడిని పట్టుకునేందుకు గాలిస్తుండగా షేఖుపూర్ అడవిలో సాజిద్ కనిపించాడని ఐజీ తెలిపారు. పోలీసులను చూసి సాజిద్ కాల్పుల జరిపాడని, ఎదురు కాల్పుల్లో హతమయ్యాడని వెల్లడించారు.