BAAP IT Company In Ahmednagar : సరైన రోడ్డు సదుపాయం కూడా లేని గ్రామీణ ప్రాంతంలో ఐటీ కంపెనీని ప్రారంభించారు ఓ వ్యక్తి. రైతుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఈ కంపెనీ ఉద్యోగం మాత్రమే కాదు. మాస్టర్ డిగ్రీ చేయాలని అనుకునేవారికి కూడా అవకాశం కల్పిస్తోంది. అదే మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లాలో ఉన్న 'బాప్'ఐటీ కంపెనీ.
సంగమ్నేర్ తాలూకాకు చెందిన రావ్‌సాహెబ్ ఘుగే రెండు సంవత్సరాల క్రితం బిజినెస్ ఆప్లికేషన్ అండ్ ప్లాట్‌ఫారమ్- బాప్ పేరుతో ఐటీ కంపెనీని స్థాపించారు. ఇంట్లో ఇబ్బందుల వల్ల పట్టణాలకు వెళ్లి ఉద్యోగాలు చేయలేని వారి కోసం గ్రామీణ ప్రాంతంలోనే ఐటీ కంపెనీ పెట్టాలని నిర్ణయించుకున్నారు రావ్‌సాహెబ్. 'నేను ఉన్నత విద్య కోసం రుణాలు తీసుకోవడానికి బ్యాంకుల దగ్గరకు వెళ్లాను. అక్కడ మీ నాన్న రైతు కదా జీతాలు రావు అని రుణం ఇవ్వడానికి నిరాకరించాయి. ఎన్ని బ్యాంకులు తిరిగిన ఎవరూ ఇవ్వలేదు. అప్పుడు చాలా ఇబ్బందులు పడి విద్యను పూర్తి చేశాను. ఆ తర్వాత అమెరికా వెళ్లి ఉద్యోగంలో చేరాను. అలా నాలా ఎవరూ ఇబ్బందులు పడకూడదని రైతుల పిల్లల కోసం గ్రామీణ ప్రాంతంలో ఐటీ కంపెనీ పెట్టాలని నిర్ణయించుకున్నా' అని రావ్‌సాహెబ్ తెలిపారు.
"గ్రామాల అభివృద్ధి కోసమే ఈ ప్రాంతంలో బాప్ కంపెనీ స్థాపించాను. ఇందులో రైతుల పిల్లలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని అనుకున్నా. ప్రస్తుతం కంపెనీలో 450 మంది ఉన్నారు. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా కంపెనీలతో బాప్ కలిసి పని చేస్తుంది."
- రావ్‌సాహెబ్ ఘుగే, బాప్ కంపెనీ వ్యవస్థాపకుడు
కంపెనీ డైరెక్టర్‌గా తన తండ్రినే నియమించారు రావ్‌సాహెబ్ ఘుగే. కంపెనీ గేటు దగ్గర రైతుల గుర్తుగా తెల్లటి టోపీ సింబల్‌ను పెట్టారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే ఇంటి దగ్గర ఉండి తల్లిదండ్రులను చూసుకుంటున్నామని ఉద్యోగులు తెలిపారు. అలాగే ఉన్నత విద్యను కూడా పూర్తి చేస్తున్నామని అంటున్నారు.