కోట్లాది మంది కల సాకారం- అయోధ్యలో కొలువుదీరిన శ్రీరాముడు Ayodhya Ram Mandir Pran Pratishtha Ceremony :శ్రీరామజన్మభూమి అయోధ్యలో చారిత్రక ఘట్ట ఆవిష్కృతమైంది. బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. దిల్లీ నుంచి అయోధ్య వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ సంప్రదాయ దుస్తులతో శ్రీరాముడి భవ్యమందిరానికి చేరుకున్నారు. రాముడికి ప్రత్యేక వస్త్రాలను తీసుకుని వచ్చి పండితులకు సమర్పించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య యాజమాన్‌గా మోదీ వ్యవహరించారు. ప్రధాని మోదీ సమక్షంలో ఆలయంలో తొలుత ప్రత్యేక పూజలు చేశారు. వేదమంత్రాలు, మంగళవాద్యాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని మోదీ పక్కనే RSS అధినేత మోహన్ భగవత్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆశీనులై పూజల్లో పాల్గొన్నారు.
తర్వాత గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహం వద్ద ప్రధాని మోదీ ప్రాణ ప్రతిష్ట క్రతువును చేపట్టారు. వేదమంత్రోచ్ఛారణ మధ్య పూజాదికాలు నిర్వహించారు. మధ్యాహ్నం 12.20 నుంచి ఒంటి గంట మధ్య అభిజిత్ లగ్నంలో ప్రాణప్రతిష్ఠ వేడుకను నిర్వహించారు. పండితుల సమక్షంలో 51అంగుళాల ఎత్తైన రామ్ లల్లా విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాముడికి ప్రధాని మోదీ పుష్పాలు, నైవేద్యం సమర్పించారు. అనంతరం శ్రీరాముడికి ప్రధాని హారతి ఇచ్చారు. విల్లు, బాణం ధరించి, బంగారు ఆభరణాలతో అద్భుతంగా అలంకరించిన బాలరాముడిని చూసి భక్తకోటి పులకరించింది. చిరు దరహాసం, ప్రసన్న వదనంతో బాలరాముడి దర్శన భాగ్యం కలగడం వల్ల ప్రధాని మోదీ సహా అతిథులు, ప్రజలు తన్మయత్వం చెందారు.
25 రాష్ట్రాలకు చెందిన వాయిద్యకారులు ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగిసే వరకు మంగళ వాయిద్యాలు మోగించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా వ్యవహరించారు. ప్రాణప్రతిష్ఠ సమయంలో ఆలయంపై హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించారు. ఆలయం ప్రాంగణం వెలుపల ఏర్పాటు చేసిన కుర్చీల్లో ఆశీనులైన దేశ, విదేశీ అతిథులు ఈ ప్రాణప్రతిష్ఠ ఘట్టాన్ని LED తెరలపై వీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసి జయజయ ధ్వానాలు చేశారు.
51 అంగుళాల బాలరాముడి విగ్రహం
Ayodhya Ram Statue Specifications :మైసూర్‌కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ బాలరాముడి విగ్రహాన్ని రూపొందించారు. 51 అంగుళాల పొడవైన బాలరాముడి విగ్రహం దైవత్వం ఉట్టిపడేలా భక్తులను మంత్రముగ్ధుల్ని చేసేలా తీర్చిదిద్దారు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతారాలను బాలరాముడి విగ్రహానికి ఇరువైపులా ఉండేలా అద్భుతంగా మలిచారు. బాలరాముడి విగ్రహం పైభాగంలో ఓం, గణేశ, చక్రం, శంఖం, గద, స్వస్తిక్ గుర్తులు ఉన్నాయి. కమల నయనాలను పోలినట్లు బాలరాముడి కళ్లను తీర్చిదిద్దారు. బాలరాముడి విగ్రహం కింద భాగంలో ఒకవైపు హనుమ, మరొకవైపు గరుడ ఉండేటట్లు విగ్రహాన్ని మలిచారు.
రామమందిరాన్ని విద్యుద్దీపాలతో అలంకరణ
రామ మందిరాన్ని రంగు రంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అయోధ్య నగరం మొత్తాన్నీ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడేలా తయారు చేశారు. శ్రీరాముడి చిత్రాలతో పై వంతెనల వీధి దీపాలను అలంకరించారు. విల్లంబుల కటౌట్లను ఏర్పాటు చేశారు. సంప్రదాయ రామానంది తిలక్ డిజైన్లతో దీపాలను ముస్తాబు చేశారు. మంచి ఘడియలు వచ్చాయి (శుభ్ ఘడీ ఆయీ), అయోధ్య ధామం తయారైంది (తయ్యార్ హై అయోధ్య ధామ్), శ్రీరాముడు ఆసీనులవుతారు (విరాజేంగే శ్రీరామ్), రాముడు మళ్లీ తిరిగొస్తారు (రామ్ ఫిర్ లౌటేంగే), అయోధ్యలో రామరాజ్యం వచ్చింది (అయోధ్యమే రామ్ రాజ్య) అనే స్లోగన్లు, నినాదాల పోస్టర్లు నగరమంతా దర్శనమిచ్చాయి.