తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రామ్​లల్లా ప్రాణప్రతిష్ఠకు ప్రముఖులు- ఎల్​కే అడ్వాణీ దూరం

Ayodhya Ram Mandir Guests : అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠకు అతిరథ మహారథులు హాజరయ్యారు. రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, సినీతారలు, క్రీడాకారులు రామజన్మ స్థలానికి తరలివచ్చి శ్రీరామ చంద్రమూర్తి ప్రాణ ప్రతిష్ఠ క్రతువులో పాల్గొని పులకించిపోయారు. అయితే బీజేపీ అగ్రనేత ఎల్​కే అడ్వాణీ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.

Ayodhya Ram Mandir Guests
Ayodhya Ram Mandir Guests

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2024, 2:00 PM IST

రామాలయం ప్రారంభోత్సవంలో ప్రముఖులు

Ayodhya Ram Mandir Guests : అయోధ్య రామ మందిర ప్రారంభ మహోత్సవ మహా ఘట్టానికి అతిరథ మహారథులు హాజరయ్యారు. ఈ ముహూర్తానికే పలువురు కేంద్రమంత్రులు వేర్వేరు రాష్ట్రాల్లోని ఆలయాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్​ అధినేత ముకేశ్ అంబానీ దంపతులు, వారి కూతురు ఈషా అంబానీ దంపతులు శ్రీ రామచంద్ర మూర్తి ప్రాణప్రతిష్ఠ వేడుకల్లో పాల్గొన్నారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్​వీ రమణ కూడా ఈ మహాక్రతువులో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ కార్యక్రమానికి హాజరైన వారిలో ఉన్నారు.

అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన వారిలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌, అలనాటి నటి హేమ మాలిని, సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, మెగాస్టార్‌ చిరంజీవి, నటి మాధురీ దీక్షిత్ ఉన్నారు. అనుపమ్‌ ఖేర్‌, కైలాష్ ఖేర్, జాకీ ష్రాఫ్‌, అక్షయ్ కుమార్, వివేక్ ఒబెరాయ్‌, టైగర్ ష్రాఫ్, కంగనా రనౌత్‌ శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యారు. సినీ జంటలు అలియా భట్-రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్-కత్రినా కైఫ్‌ సహా నటులు షెఫాలీ షా, రణ్‌దీప్‌ హూడా, ఆయుష్మాన్‌ ఖురానా, లిన్‌ లైష్రామ్‌ బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు.

1987నుంచి దూరదర్శన్‌లో ప్రసారమైన రామాయణం సీరియల్‌లో సీతారాముల పాత్రలు పోషించి, దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న దీపికా చికిలియా, అరుణ్‌ గోవిల్‌ అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రముఖ సినీ దర్శక, నిర్మాతలు సుభాష్ ఘయ్, రాజ్‌కుమార్ హిరానీ, రోహిత్ శెట్టి, మధుర్ భండార్కర్, విపుల్‌ షా, నిర్మాత మహావీర్‌ జైన్‌ దివ్య మందిర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ప్రముఖ నేపథ్య గాయకులు అనుమాలిక్‌, సోనూ నిగమ్‌, శంకర్ మహదేవన్, ఆదినాథ్ మంగేష్కర్ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శంకర్‌ మహాదేవన్‌, సోనూ నిగమ్‌ గాత్ర కచేరీ ఆకట్టుకుంది.

మాజీ క్రికెటర్లు సచిన్‌ తెందూల్కర్‌, అనిల్ కుంబ్లే, రవీంద్ర జడేజా, బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌, మిథాలీ రాజ్‌, పరుగుల రాణి పీటీ ఉష, యోగాగురు బాబా రాందేవ్‌ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఎల్​కే అడ్వాణీ దూరం
రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీ హాజరుకాలేదు. చలి, వయోభారం కారణంగా ఎల్‌కే అడ్వాణీ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరవ్వట్లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. రామమందిర ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన అడ్వాణీ రామ్​లల్లా ప్రాణప్రతిష్ఠకు హాజరుకాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అంతకుముందు కొద్ది రోజుల క్రితం అడ్వాణీ రామ్​ లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరవ్వట్లేదని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయనకు ఆహ్వానం అందింది. అయినప్పటికీ పలు కారణాల వల్ల ఆయన హాజరుకాలేదు.
రామాలయ నిర్మాణం కోసం అడ్వాణీ 1990 డిసెంబరు 6న రథయాత్ర చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details