తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రామమందిర అంశంతో బీజేపీ- కుల సమీకరణాలపై 'ఇండియా' ధీమా- అయోధ్యలో విజయమెవరిదో?

Ayodhya Constituency Lok Sabha Election : ఉత్తర్​ప్రదేశ్‌లోని అయోధ్య (ఫైజాబాద్) లోక్‌సభ స్థానంలో ఈసారి ఎన్నికల సమరం ఉత్కంఠను రేపుతోంది. ప్రధాన పోటీ బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ లల్లూ సింగ్‌, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్‌ ప్రసాద్‌ మధ్యే నెలకొంది. ఈసారి ఎన్నికల్లో సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌లు కలిసి పనిచేయనున్నాయి. అయోధ్య రామమందిర అంశంతో బీజేపీ జనంలోకి వెళ్తుండగా, సామాజిక వర్గ సమీకరణాల బలంపై ఇండియా కూటమి ఆశలు పెట్టుకుంది. మొత్తం మీద యావత్ దేశం చూపు ప్రస్తుతం ఈ స్థానం వైపే ఉంది.

Ayodhya Constituency Lok Sabha Election
Ayodhya Constituency Lok Sabha Election

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 5:23 PM IST

Updated : Mar 19, 2024, 6:09 PM IST

Ayodhya Constituency Lok Sabha Election :అయోధ్య- ఇటీవల కాలంలో మనదేశంలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన పేరు ఇదేనని నిస్సందేహంగా చెప్పొచ్చు. అయోధ్యలో నిర్మించిన భవ్య రామ మందిరాన్ని జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అంతేకాదు అయోధ్య రామమందిర అంశాన్ని ఈ ఎన్నికల్లో అత్యంత కీలకమైన అంశంగా జనంలోకి బీజేపీ తీసుకెళ్లబోతోంది.

''ఇచ్చిన మాటను నిలుపుకున్నాం, అయోధ్య రామయ్యకు గుడిని కట్టించాం'' అనే విషయాన్ని ఓటర్లలోకి బలంగా తీసుకెళ్లేందుకు కమలదళం సమాయత్తం అవుతోంది. ఇంతటి ప్రాధాన్యతను కలిగిన రామమందిరానికి నెలవుగా ఉన్న అయోధ్య (ఫైజాబాద్) లోక్‌సభ స్థానంలో ఈసారి ఎన్నికల సమరం సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. మే 20న జరగనున్న పోలింగ్‌లో ఇక్కడి ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.

నాడు విడివిడిగా, నేడు కలిసిమెలిసి
అయోధ్య (ఫైజాబాద్) లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అవి అయోధ్య, బికాపుర్, మిల్కీపుర్, రుదౌలీ, దరియాబాద్ (బారాబంకీ). 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన లల్లూ సింగ్‌కే ఈసారి కూడా బీజేపీ టికెట్ ఇచ్చింది. రామమందిరాన్ని నిర్మించి అయోధ్యకు వన్నె తెచ్చిన బీజేపీ వైపే ప్రజలంతా నిలుస్తారనే ధీమాతో లల్లూ సింగ్‌ ఉన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు అయోధ్య స్థానంలో విడివిడిగానే పోటీచేశాయి. ఈసారి ప్రతిపక్షాల ఇండియా కూటమి తరఫున సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్‌ ప్రసాద్‌ పోటీ చేయబోతున్నారు.

కుల సమీకరణాలే కీలకం
ప్రస్తుత బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌ ఠాకూర్‌ రాజ్‌పుత్ వర్గానికి చెందినవారు. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్‌ ప్రసాద్‌ దళిత వర్గానికి చెందినవారు. అయోధ్య లోక్‌సభ స్థానంలో గెలవాలంటే మతపరమైన అంశాల కంటే కులపరమైన అంశాలకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈవిషయం అక్కడి రాజకీయ పార్టీలకు బాగా తెలుసు. గతంలో అయోధ్యలో జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా కుల సమీకరణాల ప్రాధాన్యాన్ని నిరూపించాయి.

ఈ సీటు పరిధిలోని మొత్తం ఓటర్లలో దాదాపు 26 శాతం మంది దళిత, కుర్మీ వర్గానికి చెందినవారే. అందుకే ఈసారి దళిత వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు అవధేష్‌ ప్రసాద్‌‌కు సమాజ్ వాదీ పార్టీ అవకాశం ఇచ్చింది. నియోజకవర్గంలో 14శాతం మంది ముస్లింలు, 12శాతం మంది యాదవులు, 12శాతం మంది బ్రాహ్మణులు, 6శాతం మంది రాజ్‌పుత్‌లు, 4శాతం మంది వైశ్యులు ఉన్నారు. ఈ లోక్‌సభ సెగ్మెంట్‌లోని యాదవ, ముస్లిం వర్గాల ఓట్లు ప్రతిసారీ సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులకే పడుతుంటాయి. ఈసారి ఈ రెండు వర్గాల ఓట్ల ఏకీకరణ జరగబోతోంది. దీనివల్ల ఫలితం తమకు అనుకూలంగా వస్తుందనే అంచనాలతో ఇండియా కూటమి ఉంది.

గత ఫలితాలు ఏం చెబుతున్నాయి?
2014, 2019 ఎన్నికలలో అయోధ్య లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి లల్లూసింగ్ గెలవగా, ఈ రెండుసార్లు కూడా సమాజ్ వాదీ పార్టీయే రెండోస్థానంలో నిలిచింది. 2019లో ఆసక్తికరమైన ఫలితం వచ్చింది. బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌కు 5.29 లక్షల ఓట్లు రాగా, సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థికి ఆనంద్ సేన్ యాదవ్‌కు 4.63 లక్షల ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల్ ఖత్రీకి 53వేల ఓట్లు వచ్చాయి. వాస్తవానికి నిర్మల్ ఖత్రీకి అయోధ్యలో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఆయన 2009లో కాంగ్రెస్‌ తరఫున అయోధ్య నుంచి లోక్‌సభకు గెలిచారు.

అయితే మోదీ వేవ్ కారణంగా 2019లో కనీసం లక్ష ఓట్లను కూడా పొందలేకపోయారు. ఒకవేళ సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు 2019 ఎన్నికల్లో చేతులు కలిపి ఉమ్మడి అభ్యర్థిని నిలిపి ఉంటే ఆనాడు బీజేపీకి విజయావకాశాలు తగ్గి ఉండేవి. ఏదిఏమైనప్పటికీ ఈ దఫా ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు కుదిరింది. ఇందులో భాగంగా అయోధ్య సీటు సమాజ్ వాదీ పార్టీకి దక్కింది. ఈసారి ఫలితాలపై ఇండియా కూటమి ఎఫెక్ట్ ఎంతమేర ఉంటుందనేది తెలియాలంటే జూన్ 4 దాకా వేచిచూడాల్సిందే.

తిరువనంతపురంలో టఫ్​ ఫైట్​! విజయంపై థరూర్​ ధీమా! కేరళలో జెండా పాతేందుకు బీజేపీ రె'ఢీ'

బీజేపీ ఆకాశంలోకి- కాంగ్రెస్ పాతాళంలోకి! 40 ఏళ్లలో ఎంతో మార్పు

Last Updated : Mar 19, 2024, 6:09 PM IST

ABOUT THE AUTHOR

...view details