Man Sentenced To 141 Years : రెండు వేర్వేరు కేసుల్లో మైనర్లపై అత్యాచారానికి పాల్పడ్డ దోషులకు న్యాయస్థానాలు కఠిన శిక్షలు విధించాయి. ఇంట్లో ఉన్న మైనర్ బాలికపై సంవత్సరాల తరబడి అత్యాచారానికి తెగబడిన సవతి తండ్రికి కేరళ కోర్టు ఏకంగా 141 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మహారాష్ట్రలో బాలికకు డ్రగ్స్ అలవాటు చేసి, పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టిన ముగ్గురు వ్యక్తులకు పోక్సో కోర్టు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
దారుణం
మైనర్ బాలికపై అనేక సంవత్సరాలపాటు అత్యాచారానికి తెగబడ్డ సవతి తండ్రికి కేరళ కోర్టు కఠిన శిక్ష విధించింది. 141 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. తల్లి ఇంట్లో లేనప్పుడు సవతి తండ్రి బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లికి చెప్పకూడదని బెదిరించాడు. స్నేహితుల సలహాతో చివరకు ఆ బాలిక తల్లికి విషయం చెప్పడం వల్ల ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తిచేశారు. ఈ కేసులో సవతి తండ్రిని మంజేరి ఫాస్ట్ ట్రాక్ కోర్టు దోషిగా తేల్చింది. పోక్సో చట్టం, ఐపీసీ, జువైనల్ చట్టాల ప్రకారం నిందితుడికి పలు దఫాలుగా మొత్తం 141 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి అష్రఫ్ తీర్పు వెలువరించారు. రూ.7,85,000 జరిమానా సహా బాలికకు పరిహారం అందించాలని ఆదేశించారు. జైలు నిబంధనల ప్రకారం, అతడు 40 ఏళ్లు జైలు శిక్ష అనుభవిస్తాడు. వాటితో పాటు వివిధ శిక్షలను ఏకకాలంలో అమలు చేస్తారు.
డ్రగ్స్ అలవాడు చేసి!
2017లో మహారాష్ట్రలో 13 ఏళ్ల బాలికకు డ్రగ్స్ అలవాటు చేసి మూడు నెలలకు పైగా అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురికి పోక్సో కోర్టు 10 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించింది. ఇలాంటి కేసుల్లో దోషులను ఉపేక్షించరాదని ఉక్కు పాదంతో అణచివేయాలని స్పష్టం చేసింది. ముగ్గురు దోషులు రూ.50వేలు చొప్పున బాధితురాలికి పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. 2017లో బిహార్ నుంచి వలస వచ్చిన కుటుంబం థానేలో నివాసం ఉంది. బాలిక తండ్రి సౌదీ అరేబియాలో పని చేసేవాడు. అదే సమయంలో బాలికను ముగ్గురు వ్యక్తులు పరిచయం చేసుకుని డ్రగ్స్ అలవాటు చేసి పలుమార్లు అత్యాచారం చేశారు. సౌదీ నుంచి వచ్చిన తండ్రి బాలికలో వచ్చిన మానసిక మార్పుల్ని గుర్తించి వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది.