Attack On Minister :ఉత్తర్ప్రదేశ్ మంత్రి, నిషాద్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిషాద్ ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆయనపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సంజయ్ నిషాద్ గాయపడ్డారు. ఆయన ముక్కు నుంచి రక్తం రావడం వల్ల వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సంత్ కబీర్ నగర్లోని మహ్మద్‌పుర్ కత్తర్ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై మంత్రి వ్యక్తిగత కార్యదర్శి వినోద్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
"ఆదివారం అర్ధరాత్రి సమయంలో నా కుమారుడు ప్రవీణ్ నిషాద్ సంత్ కబీర్ నగర్ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని కొందరు నాతో వాగ్వాదానికి దిగారు. నేను నిషాద్ కమ్యూనిటీకి నాయకత్వం వహిస్తాను. నా కార్యకర్తలు ఎక్కడున్నా వారి వివాహాలకు తప్పకుండా హాజరవుతాను. ఓ వివాహానికి హాజరయ్యేందుకు ఆదివారం రాత్రి వెళ్తుండగా కొందరు నా కుమారుడు ప్రవీణ్ నిషాద్ పైనా, నిషాద్ పార్టీ పైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారు మా వర్గానికి చెందిన వారే అయి ఉండొచ్చని వారిని సముదాయించేందుకు ప్రయత్నించా. అంతలోనే నాపై 20-25 మంది దాడి చేశారు. దీంతో నా కళ్లద్దాలు పగిలి ముక్కుకు గాయమైంది. నాపై దాడి చేసిన వారందరూ యాదవులే " అని మీడియాతో సంజయ్ నిషాద్ తెలిపారు.
ఆస్పత్రి వద్ద నిరసన
దాడి అనంతరం తన పార్టీ కార్యకర్తలతో కలిసి సంజయ్ నిషాద్ ఆస్పత్రి వద్ద నిరసనకు దిగారు. ఎస్పీ సత్యజిత్ గుప్తా ఆస్పత్రిలో సంజయ్ ను పరామర్శించి దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం వల్ల ఆయన నిరసనను విరమించారు. మరోవైపు, సంజయ్ నిషాద్పై దాడిని ఉత్తర్ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఎక్స్ వేదికగా ఖండించారు. రాష్ట్రంలో గూండాయిజాన్ని సహించేది లేదని అన్నారు.