Assam Gang Rape Accused : అసోంలోని నాగావ్ జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు చెరువులో దూకి మృతి చెందాడు.ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.అనంతరం శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు పోలీసులు క్రైమ్ సీన్ రిక్రియేషన్ కోసం నేరం జరిగిన ప్రదేశానికి పోలీసలు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నిందితుడు పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకొని చెరువులోకి దూకాడు. వెంటనే అతడి కోసం వెతకగా, దాదాపు రెండు గంటల తర్వాత అతని మృతదేహం లభించిందని పోలీసులు తెలిపారు.
ఇదీ కేసు
అసోంలోని నాగావ్ జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలిక ట్యూషన్ అనంతరం సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా, బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను సమీపంలోని చెరువు వద్దకు లాక్కెళ్లారు. అత్యాచారానికి ఒడిగట్టి పారిపోయారు. గాయాలపాలై అపస్మారక స్థితిలో ఉన్న బాలికను స్థానికులు రక్షించారు. పోలీసులు బాలికను ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు మైనర్ పోలీసులకు తెలపింది. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేశామనీ, మరొకరిని అదుపులోకి తీసుకున్నామని శుక్రవారం పోలీసులు ప్రకటించారు. ఇందులో ప్రధాన నిందితుడిని కైమ్ సీన్ రిక్రియేషన్ కోసం శనివారం తెల్లవారుజామున తీసుకెళ్లగా, ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.