Assam Beef Ban :అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, బహిరంగ ప్రదేశాల్లో గొడ్డు మాంసం విక్రయించడాన్ని, తినడాన్ని నిషేధిస్తున్నట్లు సీఎం హిమంత బుధవారం ప్రకటించారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే గొడ్డు మాంసం వినియోగంపై ఆంక్షలు ఉన్నాయి. అయితే ఆ చట్టాన్ని సవరించి కొత్త నిబంధనలను చేర్చాలని రాష్ట్ర మంత్రివర్గం తాజా సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అసోంలో బీఫ్ బ్యాన్- కాంగ్రెస్‌కు బీజేపీ ఛాలెంజ్ - ASSAM BEAF BAN
అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం- రాష్ట్రంలో గొడ్డు మాంసం బ్యాన్
Published : Dec 4, 2024, 7:00 PM IST
'అసోంలో పూర్తిగా బీఫ్‌ను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు నుంచి రాష్ట్రంలో పూర్తిగా గొడ్డు మాంసం వినియోగాన్ని నిషేధిస్తున్నాం. హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్లిక్ ఫంక్షన్లు, బహిరంగ ప్రదేశాల్లో బీఫ్ తినడాన్ని, విక్రయించడాన్ని బ్యాన్ చేస్తున్నాం. రాష్ట్రంలో మందిరాల వద్ద బీఫ్ అమ్మడం, తినడంపై ఇప్పటికే ఆంక్షలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రమంతటా ఈ చట్టం అమలు కానుంది.' అని హిమంత ప్రెస్మీట్లో చెప్పారు. తమ ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ నాయకులు ఆహ్వానిస్తారని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
సమర్థించాలి లేదా పాకిస్థాన్ వెళ్లిపోవాలి!
బీఫ్ వ్యవహారంపై కొద్ది రోజులుగా అసోంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలోనే రెండు పార్టీల మధ్య బీఫ్ వ్యవహారం వివాదాస్పమైంది. ఇటీవల అసోంలో జరిగిన ఉప ఎన్నికల్లో సమగురి అసెంబ్లీ నియోజకవర్గంలోని మైనార్టీ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సీఎం హిమంత బీఫ్ పార్టీ నిర్వహించారని కాంగ్రెస్ ఎంపీ రబికుల్ హుస్సేన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాసేపటికే కాంగ్రెస్‌కు అధికార పక్షం ఓ సవాలు విసిరింది. "బీఫ్ బ్యాన్‌ను కాంగ్రెస్ సమర్థించాలి. లేదంటే ఆ పార్టీ నేతలు పాకిస్థాన్ వెళ్లిపోవాలి" అని అసోం మంత్రి పిజూష్ హజారికా ట్వీట్ చేశారు.