Arvind Kejriwal Skips ED Summons :దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి గైర్హాజరయ్యారు. శుక్రవారం జరిగే విచారణకు రావట్లేదని ఈడీకి కేజ్రీవాల్ సమాచారం ఇచ్చారు. ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధంగా ఉన్నాయన్న కేజ్రీవాల్ ఈ సందర్భంగా ఆరోపించారు. ఇప్పటికే 4 సార్లు ఈడీ విచారణకు హాజరుకాని కేజ్రీవాల్, ఐదోసారి అదే నిర్ణయం తీసుకున్నారు.
'ప్రభుత్వాన్ని కూల్చాలనే ఈ కుట్ర'
'మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు హాజరుకావడం లేదు. ఆయన్ను అరెస్టు చేసే ఉద్దేశంతోనే ఈడీ పదేపదే నోటీసులు ఇస్తోంది. తద్వారా దిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ భావిస్తోంది' అని ఆమ్‌ఆద్మీ పార్టీ ఆరోపించింది.
'కోర్టులో సవాలు చేయవచ్చు కదా?'
'దిల్లీ సీఎం ఈడీ విచారణకు మరోసారి గైర్హాజరయ్యారు. ఆయన ఇలా చేయడం ఇది ఐదో సారి. కేజ్రీవాల్ ఈడీ సమన్లను చట్టవిరుద్ధంగా పేర్కొంటున్నప్పుడు వాటిని కోర్టులో ఎందుకు సవాలు చేయట్లేదు? ప్రజల్లో సానూభూతి పొందేందుకు ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నారు' అని బీజేపీ నాయకుడు హరీశ్ ఖురానా ప్రశ్నించారు.
పోలీసుల హై అలర్ట్!
మరోవైపు దేశ రాజధానిలో ఆప్, బీజేపీ శుక్రవారం ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు బందోబస్తుకు భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఈ మేరకు హైఅలర్ట్‌లో ఉన్నామని దిల్లీ పోలీసులు ప్రకటించారు. పారామిలటరీ బలగాలనూ భద్రతలో భాగం చేసినట్లు వెల్లడించారు. పలు మార్గాల నుంచి వాహనాల రాకపోకలను దారి మళ్లించనున్నట్లు తెలిపారు.