Arvind Kejriwal ED Arrest :లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌తో తమ పొత్తు ఖరారైన నేపథ్యంలో బీజేపీ భయపడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు ఈడీతో పాటు సీబీఐని కూడా ఉపయోగించుకుంటోందని ఆరోపించింది. ఆప్-కాంగ్రెస్ పొత్తు కుదిరితే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తారనే సందేశాలు వస్తున్నాయని మరో రెండు, మూడు రోజుల్లో కేజ్రీవాల్‌ను అరెస్టు చేయవచ్చని తెలిపింది.
కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద ఇప్పటికే నోటీసులు కూడా సిద్ధమయ్యాయని తమ వద్ద సమాచారం ఉందని దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. అందుకే కాంగ్రెస్ - ఆప్ మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు ముగిసినట్లు నివేదికలు రాగానే, కేజ్రీవాల్‌కు ఈడీ ఏడోసారి సమన్లు జారీ చేసిందని తెలిపారు. కాంగ్రెస్-ఆప్ మధ్య సీట్ల పంపకాలపై చర్చలు తుది దశకు చేరుకున్నాయన్న వార్తతో బీజేపీకి నిద్ర పట్టడం లేదని దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ విమర్శించారు.
'కేజ్రీ అరెస్ట్‌తో సునామీ వస్తుంది'
కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తే ప్రజలు వీధుల్లోకి వస్తారని, ప్రజా సునామీ వస్తుందని, అందులో బీజేపీ కొట్టుకుపోవడం ఖాయమని ఆప్ రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్ హెచ్చరించారు. బీజేపీ రాజకీయ సమీకరణాలు తప్పుతాయని జోస్యం చెప్పారు. అరెస్టులకు తాము భయపడటం లేదని, దేశం కోసం కూటమిని ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు.