తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బీజేపీ టికెట్​పై అరుణ్​ గోయెల్ పోటీ?'- ఎన్నికల కమిషనర్ రాజీనామాపై విపక్షాలు ఫైర్

Arun Goel Resigns : ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామాపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. లోక్​సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కమిషనర్​ రాజీనామాతో స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలు ఎలా సాధ్యమంటూ ప్రశ్నించాయి.

arun goel resigns
arun goel resigns

By ETV Bharat Telugu Team

Published : Mar 10, 2024, 11:32 AM IST

Updated : Mar 10, 2024, 12:00 PM IST

Arun Goel Resigns : లోక్​సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామాపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసేందుకే అరుణ్ గోయల్​ రాజీనామా చేశారా అని ప్రశ్నించారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్​. "ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థ. దీనికి కమిషనర్​ అరుణ్​ గోయల్ రాజీనామా చేశారు. ఇందుకు నాకు మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్​ లేదా మోదీతో ఏమైనా విభేదాలు తలెత్తి ఉండాలి. రెండోది ఆయన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసి ఉండొచ్చు. మూడోది ఆయన బీజేపీ టికెట్​పై ఎన్నికల్లో పోటీ చేసేందుకు అయినా చేయాలి? అయితే మరికొద్ది రోజుల్లోనే దీనిపై పూర్తి స్పష్టత వస్తుంది." అని జైరాం రమేశ్​ అన్నారు.

మరోవైపు అరుణ్ గోయల్ రాజీనామాపై స్పందించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​, స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలు ఎలా సాధ్యమంటూ ప్రశ్నించారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే రాజీనామా చేయడం ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పారు. "ప్రస్తుతం ఎన్నికల సంఘంలో ఒక కమిషనర్ మాత్రమే ఉన్నారు.​ అసలు ఈసీలో ఏం జరుగుతుంది. అంతకుముందు ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించారు. ఆయన స్థానంలో కేబినెట్​ మంత్రిని పెట్టారు. ఫలితంగా ఇది ప్రభుత్వ విషయంగా మారిపోయింది. ఈ నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించింది." అని వేణుగోపాల్​ తెలిపారు.

'ఎన్నికల కమిషనా లేదా ఎన్నికల ఒమిషనా'
అంతకుముందు అరుణ్ గోయల్ రాజీనామాపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది 'ఎన్నికల కమిషనా లేదా ఎన్నికల ఒమిషనా' అని ఆయన విమర్శించారు. లోక్‌సభ ఎన్నికలను మరికొన్ని రోజుల్లో ప్రకటించబోతున్నప్పటికీ, భారత్‌లో ఇప్పుడు ఒకే ఎన్నికల కమిషనర్ ఉన్నారు. ఎందుకు? అంటూ ఆయన ప్రశ్నించారు. తాను ఇంతకు ముందు చెప్పినట్టుగా స్వతంత్ర సంస్థల వ్యవస్థాగత నిర్మూలనను ఆపకపోతే, ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వం లాక్కుపోతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ECI, పతనమైన చివరి రాజ్యాంగ సంస్థలలో ఒకటిగా ఉంటుందని ఖర్గే చెప్పారు. అనుప్ పాండే పదవీ విరమణ చేసి 23 రోజుల అయిన తర్వాత కూడా కొత్త ఎన్నికల కమిషనర్‌ను ఎందుకు నియమించలేదని ఖర్గే ప్రశ్నించారు.

టీఎంసీ ఫైర్​
అరుణ్ గోయల్ రాజీనామా చేయడం వల్ల ముగ్గురు సభ్యుల EC ప్యానెల్‌లో రెండు ఖాళీలు ఉన్నాయని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్యానెల్‌కు రెండు నియామకాలు జరగడం ఆందోళన కలిగిస్తుందన్నారు. 2023లో కేంద్రం తెచ్చిన చట్టం ప్రకారం ఈ ఇద్దరు కమిషనర్ల నియామకం ప్రధాని చేతుల్లో ఉందనీ, ఇది ఆందోళన రేకెత్తిస్తోందని పేర్కొన్నారు.

ఈసీ ప్యానెల్​లో ఒక్కరే
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ అరుణ్‌ గోయల్‌ శనివారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. మరో మూడేళ్లు పదవీకాలం ఉండగానే అరుణ్‌ గోయల్‌ రాజీనామా చేశారు. అయితే రాజీనామాకు గల కారణాలు తెలియరాలేదు. 1985 పంజాబ్‌ కేడర్‌కు చెందిన మాజీ IAS అధికారి గోయల్‌ 2022 నవంబరులో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమితులయ్యారు. ఫిబ్రవరిలో అనుప్ పాండే పదవీ విరమణ, ప్రస్తుతం గోయల్ రాజీనామాతో ముగ్గురు సభ్యుల కేంద్ర ఎన్నికల సంఘం ప్యానెల్‌లో ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు.

Last Updated : Mar 10, 2024, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details