Arrangements For Devotees In Ayodhya : ఇలలో వెలసిన స్వర్గపురి సీమ అయోధ్యాపురి. దేవదేవుడైన శ్రీమన్నారాయణుడు శ్రీరాముడిగా కొలువు తీరుతున్న అయోధ్య నగరం ఆ పుణ్యఘట్టానికి సిద్ధమైంది. ఇందుకోసం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కార్యక్రమానికి విచ్చేసే అతిథులు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సకల సౌకర్యాలు కల్పించింది.
భక్తులకు ప్రసాదంగా మోతీచూర్ లడ్డు
రామమందిరంతోపాటు ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలు, వసతి సమాచారాన్ని తెలుసుకునేందుకు యూపీ సర్కార్ దివ్య అయోధ్య యాప్‌ను ఏర్పాటు చేసింది. రాముడి దర్శనానికి వచ్చే భక్తులకు మోతీచూర్ లడ్డూ, శ్రీరాముని పురిటిగడ్డ మట్టిని మహాప్రసాదంగా ఇవ్వనున్నారు. జనవరి 23వ తేదీ నుంచి భక్తులకు రామ్ లల్లా దర్శనభాగ్యం లభించనుంది. ఉత్తర్‌ప్రదేశ్ పర్యటకశాఖ అయోధ్యకు వచ్చే అతిధుల కోసం ప్రత్యేకంగా టెంట్ సిటీ ఏర్పాటు చేసింది. హైటెక్ సదుపాయాలున్న ఇందులోని కాటేజ్‌లను వీవీఐపీల బసకోసం కేటాయించనున్నారు. నిషాద్ రాజ్ అతిథి గృహ్ పేరిట ఈ టెంట్ సిటీని నిర్మించారు.
ఒకేసారి 500 మంది భోజనం చేసేలా!
భోజనాల కోసం సీతారసోయి, శబరి రసోయి పేరిట రెండు డైనింగ్ హాళ్లు నిర్మించారు. ఇందులో ఒకేసారి 500 మంది వీఐపీలు భోజనం చేయవచ్చు. పర్యటకులు సరయూ నదిలో విహరించేందుకు సౌర శక్తి పడవలు ఏర్పాటు చేశారు. అయోధ్య నగరమంతా శాస్త్రీయ సంగీతం వినిపించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంగీత విధ్వాంసుల్ని ఎంపిక చేశారు. అయోధ్య రామాలయ ప్రతిష్ఠ కోసం 50 దేశాల నుంచి 53 మంది ప్రత్యేక అతిధులు విచ్చేస్తున్నారు. అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల వీక్షణ కోసం 8వేల మంది కూర్చునే భారీ ఆడిటోరియంను అయోధ్య నగరిలో ఏర్పాటు చేశారు.
స్పెషల్ అట్రాక్షన్‌గా 360 డిగ్రీల థియేటర్
Arrangements In Ayodhya : రామమందిరంతోపాటు అనేక ప్రత్యేకతలు రామమందిర ప్రాంగణంలో భక్తుల్ని ఆకర్షిస్తున్నాయి. 360 డిగ్రీల థియేటర్ ఇక్కడ ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడ ఒకేసారి వేలాదిమంది భక్తులు కూర్చొని శ్రీరాముడికి సంబంధించిన అనేక గాథలు వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ పక్కనే గ్యాలరీ-1 నిర్మించారు. ఇందులో రామాయణానికి సంబంధించిన విశేషాలు ఉంటాయి. మరోపక్క మ్యూజియం నిర్మితమవుతోంది. దీనికి సమీపంలోనే రెండో గ్యాలరీ ఉండనుంది. శ్రీరాముడికి సంబంధించి దేశ విదేశాల నుంచి సేకరించిన జ్ఞాపికల్ని ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. రామమందిర నిర్మాణాన్ని ఎల్ అండ్ టీ సంస్థ భాగస్వామ్యమైంది.