Army Man Creates Digital Lock :తరచుగా జరుగుతున్న దొంగతనాలను అరికట్టేందుకు నడుం బిగించారు మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మాజీ సైనికుడు. నెల రోజులపాటు శ్రమించి రూ.3 వేల ఖర్చుతో ఓ డిజిటల్ లాక్‌ను తయారు చేశారు. ఈ లాక్ ఇల్లు, ఆఫీసు, దుకాణం దేన్నైనా దొంగల నుంచి సురక్షితంగా ఉంచుతుంది. అదేలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
టచ్ చేస్తే అలర్ట్ కాల్
సాగర్ జిల్లాలోని సిద్ధ్ గువాన్ ఇండస్ట్రియల్ ఏరియాకు చెందిన మాజీ సైనికుడు ముకేశ్ కుమార్ ఈ డిజిటల్ లాక్‌ను రూపొందించారు. ఈ తాళాన్ని దొంగలు పగలగొట్టే ప్రయత్నం చేస్తే వెంటనే సైరన్ మోగుతుంది. అంతేకాకుండా డివైజ్‌కు కనెక్ట్ అయిన మొబైల్‌కు అలర్ట్ కాల్ కూడా వెళ్తుంది. ఈ డిజిటల్ లాక్కు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇందులో తాళం పగలగొట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తి ఫొటో, వీడియో కూడా రికార్డవుతుంది. రూ.3 వేల బడ్జెట్లోనే అందరికి ఉపయోగకరమైన ఈ డిజిటల్ లాక్ తయారు చేసిన ముకేశ్ కుమార్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
"నేను ఐటీఐలో ఎలక్ట్రికల్ బ్రాంచ్ చదివాను. గత కొద్ది రోజులుగా మా ప్రాంతంలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. పోలీసులు నేరాలను అరికట్టలేకపోతున్నారు. అలాగే దొంగతనానికి పాల్పడినవారిని పట్టుకోలేకపోతున్నారు. అలాంటి పరిస్థితిలో నాకు ఒక ఆలోచన వచ్చింది. అప్పుడే ఈ డిజిటల్ లాక్ తయారు చేశాను. దాన్ని తాకినప్పుడు సైరన్ మోగుతుంది. అలాగే ఆ లాక్కు కనెక్ట్ ఉన్న మొబైల్ నెంబర్‌కు అలర్ట్ కాల్ వెళ్తుంది. అంతేకాకుండా డిజిటల్ లాక్‌ను పగలగొట్టడానికి ప్రయత్నించే వారి ఫొటోతో పాటు, వీడియోను రికార్డు చేసేలా ఈ పరికరాన్ని రూపొందించాను." అని మాజీ సైనికుడు ముకేశ్ కుమార్ తెలిపారు.