తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు - Arvind Kejriwal Bail

Arvind Kejriwal Bail : దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​కు రూస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Arvind Kejriwal Bail
Arvind Kejriwal Bail (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 20, 2024, 8:06 PM IST

Updated : Jun 20, 2024, 10:04 PM IST

Arvind Kejriwal Bail :మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ భారీ ఊరట లభించింది. ఈ కేసులో దిల్లీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో 48 గంటల పాటు బెయిల్‌ ఆర్డరును నిలిపివేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం జైలు నుంచి కేజ్రీవాల్ విడుదల అవుతారని ఆప్ లీగల్ టీమ్ న్యాయవాది రిషికేష్ కుమార్ తెలిపారు.

"ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు రూస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష రూపాయల పూచీ కత్తు సమర్పించాలని ఆదేశింది. రేపు(శుక్రవారం) మధ్యాహ్నం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వస్తారు. ఇది ఆప్ నేతలకు, దేశానికి, ప్రజలకు ఇది పెద్ద విజయం" అని న్యాయవాది రిషికేష్ కుమార్ చెప్పారు.

బెయిల్‌ పిటిషన్‌కు సంబంధించి గురువారం ఉదయం (జూన్‌ 20న) తీర్పు రిజర్వ్‌ చేసిన రౌస్‌ అవెన్యూ కోర్టు వెకేషన్‌ జడ్జి నియాయ్‌ బిందు, అదే సాయంత్రం బెయిల్‌ ఆదేశాలు జారీ చేశారు. అయితే, బెయిల్‌ బాండుపై సంతకం చేసేందుకు వీలుగా 48 గంటలపాటు స్టే విధించాలని న్యాయస్థానాన్ని ఈడీ కోరింది. తద్వారా ఈ తీర్పును పై కోర్టులో సవాలు చేసేందుకు వీలు కలుగుతుందని విన్నవించింది. అయినప్పటికీ ఈడీ వాదనను తోసిపుచ్చిన కోర్టు అందుకు నిరాకరించింది.

సత్యమేవ జయతే: అతిశీ
అయితే కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆప్‌ నేత, దిల్లీ మంత్రి అతిశీ సత్యమే గెలిచిందన్నారు. సత్యానికి కొన్నిసార్లు ఇబ్బందులు రావొచ్చేమో గానీ ఓటమి మాత్రం ఉండదన్నారు. కేజ్రీవాల్ ఇంటి బయట కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చుతూ డ్యాన్సులు వేశారు.

మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటం వల్ల ఎన్నికల్లో ప్రచారం కోసం చేసిన అభ్యర్థనను అంగీకరిస్తూ కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు జూన్‌ 2న తిరిగి జైలు అధికారుల ముందు లొంగిపోయారు.

Last Updated : Jun 20, 2024, 10:04 PM IST

ABOUT THE AUTHOR

...view details