తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఏడాదికి ఫ్రీగా రెండు గ్యాస్ సిలిండర్లు- మహిళలకు నెలకు రూ.2,100'- ఝార్ఖండ్ ఓటర్లపై బీజేపీ వరాల జల్లు - JHARKHAND ELECTIONS BJP MANIFESTO

ఝార్ఖండ్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా- ఓటర్లపై హామీల వర్షం- విపక్షాలపై విమర్శలు

Jharkhand Elections BJP Manifesto
Jharkhand Elections BJP Manifesto (ANI)

By ETV Bharat Telugu Team

Published : Nov 3, 2024, 12:07 PM IST

Updated : Nov 3, 2024, 12:45 PM IST

Jharkhand Elections BJP Manifesto :ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. 'గోగో దీదీ పథకం' కింద మహిళలకు ప్రతి నెలా రూ.2,100 ఆర్థిక భరోసా ఇస్తామని తెలిపింది. దీపావళి, రక్షాబంధన్‌ కానుకగా ఏడాదికి ఉచితంగా రెండు ఎల్​పీజీ గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని, రూ.500కే గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ప్రకటించింది. ఝార్ఖండ్ యువతకు 2.87 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో సహా 5 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు రాంచీలో బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్​ షా సంకల్ప్ పత్ర పేరిట పార్టీ మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, కేంద్రమంత్రులు శివరాజ్‌ సింగ్ చౌహాన్, సంజయ్ సేథ్, బీజేపీ ఝార్ఖండ్ అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ పాల్గొన్నారు.

'వారిని జైలుకు పంపుతాం'
ఝార్ఖండ్​లో బీజేపీ అధికారంలోకి వస్తే పోటీ పరీక్షల పేపర్ లీకేజీలపై సీబీఐ, సిట్ విచారణ జరుపుతామని అమిత్ షా హామీ ఇచ్చారు. పేపర్ లీకేజీకి పాల్పడినవారిని జైలుకు పంపుతామని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలు, గనుల కారణంగా నిర్వాసితులైన ప్రజలకు పునరావాసం కోసం కమిషన్​ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సర్నామతపరమైన కోడ్ అంశంపై చర్చించి, తగిన నిర్ణయం తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారు.

'సోరెన్ సర్కార్ హయాంలో గిరిజనులకు భద్రత లేదు'
దేశంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే ఏకైన రాజకీయ పార్టీ బీజేపీయేనని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. మేనిఫెస్టో విషయంలో ఇతర పార్టీల కన్నా బీజేపీ భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్దానాలను విస్మరించకుండా నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వ హయాంలో ఝార్ఖండ్​లోని గిరిజనులకు భద్రత లేదని విమర్శించారు. సంతాల్‌ పరగణాలో గిరిజనుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోందని ఆరోపించారు.

"చొరబాటుదారులు ఝార్ఖండ్ వచ్చి ఆడబిడ్డలను ప్రలోభపెట్టి పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటి వాటిని ఆపకపోతే ఝార్ఖండ్ సంస్కృతి ప్రమాదంలో పడుతుంది. అలాగే ఆడబిడ్డలకు భద్రత ఉండదు. ఝార్ఖండ్​లో ఈ ఎన్నికలు కేవలం ప్రభుత్వాన్ని మార్చేవే కావు. రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఎన్నికలు. చొరబాటుదారులు, అవినీతిని ప్రోత్సహించే ప్రభుత్వం కావాలా? అభివృద్ధి, సరిహద్దులను కాపాడే మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కావాలా? ఝార్ఖండ్​లో బీజేపీ ప్రభుత్వం త్వరలో ఏర్పడుతుంది. చొరబాటుదారులను తరిమికొడతాం. అందుకు కొత్త చట్టాన్ని తెస్తాం. మహిళల నుంచి లాక్కున్న భూమిని తిరిగి వారికి ఇచ్చేస్తాం. ఝార్ఖండ్ మహిళలకు భద్రత కల్పించడంలో హేమంత్ సోరెన్ విఫలమయ్యారు" అని అమిత్ షా ఆరోపించారు.

'రాష్ట్ర ప్రజలు బీజేపీ హామీలను నమ్మరు'
మరోవైపు, బీజేపీ మేనిఫెస్టోపై జేఎంఎం పార్టీ విమర్శలు గుప్పించింది. "బీజేపీ ఇచ్చిన హామీలను ఝార్ఖండ్ ప్రజలు నమ్మరు. గతంలో బీజేపీ పాలనను రాష్ట్ర ప్రజలు చూశారు. వారి పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదు. మహిళల అక్రమ రవాణా కూడా పెరిగిపోయింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి బొగ్గు రాయల్టీని ఇంకా ఇవ్వలేదు" అని జేఎంఎం నాయకురాలు మహువా విమర్శించారు.

Last Updated : Nov 3, 2024, 12:45 PM IST

ABOUT THE AUTHOR

...view details