Amit Shah On Ram Mandir :అయోధ్యలో బాలక్‌రామ్ ప్రాణప్రతిష్ఠ జరిగిన జనవరి 22వ తేదీ వేల సంవత్సరాల పాటు చరిత్రలో నిలిచిపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. శ్రీరాముడు లేని భారత్‌ను ఊహించుకోలేమని అన్నారు. లోక్‌సభలో రామ మందిర నిర్మాణంపై చర్చ సందర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. రామమందిర నిర్మాణానికి తాము ఎప్పుడూ అండగా ఉంటామని షా చెప్పారు.
"రామ మందిర ఉద్యమం లేకుండా ఈ దేశంలో ఏ ఒక్కరూ చరిత్రను చదవలేరు. 1528 నుంచి ప్రతి తరం ఏదో ఒక రూపంలో ఈ ఉద్యమాన్ని చూసింది. ఐదు శతాబ్దాల పాటు జరిగిన ఈ సుదీర్ఘ పోరాటానికి తెర పడింది. అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లౌకికవాదాన్ని చాటిచెప్పింది. దేశం కలలుగన్న అయోధ్య ఆలయం మోదీ ప్రభుత్వ హయాంలో సాకారమైంది. ప్రాణప్రతిష్ఠ సమయంలో ప్రధాని 11 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్ష చేపట్టారు" అని కేంద్రమంత్రి అమిత్ షా తెలిపారు.
ప్రతిపక్షాలపై షా ఫైర్!
ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు అమిత్ షా. "జనవరి 22న జరిగిన ప్రాణప్రతిష్ఠ నవ భారత ప్రయాణానికి నాంది. శ్రీరాముడి లేని భారతాన్ని ఊహించుకునేవారికి మన దేశం గురించి పూర్తిగా తెలియదు. వారు (కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ) ఇంకా వలసవాద రోజుల్లోనే ఉన్నారు. చరిత్ర గురించి తెలుసుకోని వారికి ఎలాంటి గుర్తింపు ఉండదు" అని అమిత్ షా అన్నారు.
ఎయిర్‌పోర్టుకు శ్రీరాముడి పేరు పెట్టాలని!
అయోధ్యలో నిర్మించిన ఎయిర్‌పోర్టుకు శ్రీరాముడి పేరు పెట్టాలని చాలా ప్రతిపాదనలు వచ్చాయని అమిత్ షా తెలిపారు. కానీ ప్రధాని మోదీ మాత్రం మహర్షి వాల్మీకి పేరును సూచించారని చెప్పారు. సమాజంలో అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పించేందుకు మోదీ ఎల్లప్పుడూ కృషి చేస్తారని కొనియాడారు.