Amit Shah Assets :భారతీయ జనతా పార్టీలో ప్రధాని మోదీ తర్వాత స్థానంలో ఉన్న కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాకు సొంత కారు లేదట. ఈ విషయాన్నిఎలక్షన్ కమిషన్‌కు సమర్పించిన ప్రమాణపత్రంలో ఆయన పేర్కొన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ వేసిన ఆయన, తన అఫిడవిట్లో ఆస్తులను ప్రకటించారు.
తనకు మొత్తం రూ. 36 కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నట్లు అమిత్ షా వెల్లడించారు. తన సతీమణి సోనాల్‌కు రూ. 31 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని తెలిపారు. ఆయనకు రూ. 72 లక్షల విలువైన ఆభరణాలు, ఆయన సతీమణికి రూ. 1.10 కోట్ల విలువైన నగలు ఉన్నట్లు పేర్కొన్నారు. తన పేరుపై రూ. 15.77లక్షల రుణం, తన సతీమణి సోనాల్ పేరుపై రూ. 26.32లక్షల రుణం ఉన్నట్లు అమిత్ షా వెల్లడించారు.
2022-23లో తన వార్షికాదాయం రూ. 75.09 లక్షలుగా పేర్కొన్న కేంద్ర హోంమంత్రి, తన సతీమణి రూ. 39.54 లక్షలు ఆర్జించినట్లు తెలిపారు. ఎంపీగా వచ్చే వేతనంతో పాటు భూమి, ఇంటి అద్దెలు, వ్యవసాయం, షేర్లు, డివిడెండ్ల ద్వారా ఆదాయం ఆర్జించినట్లు ప్రమాణపత్రంలో తెలిపారు. తనపై మూడు క్రిమినల్ కేసులు నమోదైనట్లు అమిత్‌షా ప్రకటించారు.
లోక్‌సభ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం గుజరాత్‌లోని గాంధీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చిన అమిత్ షా నామినేషన్ వేశారు. అనంతరం మాట్లాడిన షా, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ, LK అడ్వాణీ వంటి దిగ్గజ నాయకులు ప్రాతినిథ్యం వహించిన ఈ స్థానం నుంచి పోటీ చేయడం తనకు గర్వకారణమన్నారు.
30 ఏళ్లుగా గాంధీనగర్ నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేస్తున్నానని గత ఐదేళ్లలో దాదాపు 22 వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని షా తెలిపారు. ఈసారి ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లు గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నియోజకవర్గంలోనే తన ఓటును వినియోగించుకోనున్నారు. అమిత్ షాకు పోటీగా సోనాల్ పటేల్‌ను కాంగ్రెస్ బరిలో నిలిపింది. మూడో దశలో భాగంగా గుజరాత్‌లోని మెుత్తం 26 సీట్లకు మే 7 పోలింగ్ జరగనుంది.
CAAను ఎప్పటికీ వెనక్కి తీసుకోం- ఆ విషయంలో ప్రతిపక్షాలవన్నీ అబద్ధాలే : అమిత్ షా
కాంగ్రెస్ పాలన అంతా కుంభకోణాల మయం: అమిత్ షా