Hema Committee Report Actresses Allegations :మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక బయటకొచ్చిన తర్వాత దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటి వరకు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి 17 కేసులు నమోదయ్యాయి. బాధితులు ఒక్కొక్కరు తమకు జరిగిన భయానక అనుభవాల్ని బయటపెడుతున్నారు. తాజాగా నటి సోనియా మల్హార్ తానూ గతంలో వేధింపులకు గురైనట్టు తెలిపారు. 2013లో ఓ సినిమా సెట్‌లో ఒక నటుడు తనను వేధించాడని ఆమె ఆరోపించారు. మీటూ సమస్యను ఎదుర్కొనేందుకు కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం-సిట్‌కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. అయితే తన ఆరోపణలకు నటుడు జయసూర్యతో సంబంధం పెట్టొద్దని కోరారు.
బెదిరింపు సందేశాలు వస్తున్నాయంటూ!
ప్రముఖ నటుడు జయసూర్యతోపాటు చిత్ర పరిశ్రమకు చెందిన ముఖేశ్, రాజు, ఇడవేల బాబు వల్ల తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానంటూ నటి మిను మునీర్ ఇటీవల ఆరోపణలు చేశారు. అయితే ఈ విషయం బయటపెట్టిన దగ్గరి నుంచి తనకు బెదిరింపు సందేశాలు వస్తున్నాయని ఆమె తెలిపారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం మరో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో సిట్ బృందం త్వరలోనే మిను మునీర్ వాగ్మూలాన్ని రికార్డ్ చేయనున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని సినిమాలు ఇప్పిస్తానని!
2013లో ఓ సినిమా చిత్రీకరణ కోసం పనిచేస్తున్నప్పుడు టాయిలెట్‌కు వెళ్లి బయటకు వచ్చిన సమయంలో జయసూర్య తనను వెనక నుంచి హత్తుకున్నారని మిను మునీర్ ఆరోపించారు. అక్కడితో ఆగకుండా తనకు ముద్దు పెట్టారని పేర్కొన్నారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యానని, అక్కడి నుంచి పారిపోయానని తెలిపారు. ఆ తర్వాత తనతో ఉంటే మరిన్ని సినిమాలు ఇప్పిస్తానని ఆయన పేర్కొన్నట్టు ఆరోపించారు. మలయాళ సినీ కళాకారుల సంఘం- అమ్మ సభ్యత్వం పొందేందుకు సహాయం చేస్తాననే నెపంతో అమ్మ మాజీ కార్యదర్శి ఇడవెల బాబు తనను ఆయన ఫ్లాట్‌కి పిలిచి శారీరకంగా వేధించారని ఆరోపించారు.
అమ్మలో చేరడానికి అధికార సీపీఎం ఎమ్మెల్యే, నటుడు ముఖేష్ సహాయం కోరగా తన నుంచి ఏదో ఆశించాలని చూశారని ఆరోపించారు. అన్నింటినీ తట్టుకొని సినిమా కోసం వర్క్ చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ వారి వేధింపులు మితిమీరాయని వాపోయారు. ఈ సంఘటన వల్ల తాను మానసికంగా ఎంతో కుంగిపోయానన్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో దోపిడీ చాలా ఎక్కువనీ అందుకు తానే సాక్షిననీ బాధితురాలిని కూడా అని పేర్కొన్నారు. ఈ పరిణామాలతో తాను చెన్నైకి వెళ్లిపోయినప్పుడు ఏమైందని ఎవరూ అడగలేదని వాపోయారు.
సమగ్ర దర్యాప్తు జరగాలని స్వాగతిస్తున్నట్టు!
మిను మునీర్ ఆరోపణలపై సీపీఎం ఎమ్మెల్యే, నటుడు ముఖేష్ స్పందించారు. ఈ వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు జరగాలని స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. గతంలో మునీర్ తనను ఆర్థిక సాయం కోరారని, తనను బ్లాక్‌మెయిల్ చేసేందుకు యత్నించారని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితులను అవకాశంగా మలుచుకుని తనపై బురద జల్లుతున్నారని చెప్పారు. అయితే మిను మునీర్ ఆరోపణలతో ముఖేష్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సినిమాలకు సంబంధించిన పాలసీలు రూపొందించే ప్యానెల్ నుంచి పినరయి విజయన్ ప్రభుత్వం ఆయన్ను తొలగించింది.
హేమ కమిటీ నివేదికను ఉద్దేశించి సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి రంగంలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయంటూ తాజాగా ఆమె ఎక్స్‌లో సుదీర్ఘ పోస్ట్ చేశారు. చిత్ర పరిశ్రమలో మహిళలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం బాధాకరమన్న ఆమె, వీటిపై ధైర్యంగా ముందుకు వచ్చిన మహిళలను మెచ్చుకోవాలన్నారు. వేధింపులను బయట పెట్టడానికి హేమ కమిటీ రిపోర్ట్ ఎంతో ఉపయోగపడిందని చెప్పారు. కెరీర్‌లో రాణించాలనుకుంటే వేధింపులు లేదా కమిట్‌మెంట్ ఇవ్వాలని కోరడం లాంటి పరిస్థితులు మహిళలకు అన్ని రంగాల్లోనూ ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
మద్దతు ఎంతో అవసరం!
బాధితులకు అందరి మద్దతు ఎంతో అవసరమని, వారి బాధను విని మానసికంగా ధైర్యం చెప్పాలన్నారు ఖుష్భూ. గతంలో తన తండ్రి వేధింపులకు పాల్పడ్డారని చెప్పిన ఖుష్బూ ఆ విషయాన్ని చెప్పేందుకు ఎందుకు అంత సమయం తీసుకున్నావని చాలామంది అడిగినట్టు తెలిపారు. అయితే ఆ ఘటన కెరీర్ విషయంలో జరిగింది కాదనీ...తనను రక్షించాల్సిన వ్యక్తి నుంచే వేధింపులు ఎదురైనట్టు చెప్పారు. చాలామంది మహిళలకు కుటుంబం నుంచి సరైన మద్దతు లేదనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలన్నారు.
హేమ కమిటీ రిపోర్ట్‌ను ఉద్దేశించి బాలీవుడ్ నటి స్వర భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నివేదికలో వెల్లడించిన షాకింగ్ విషయాలపై ఆమె విచారం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. కమిటీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ సభ్యులను ఆమె ప్రశంసించారు. వారి వల్లే ఈ కమిటీ ఏర్పడిందని, మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు బహిర్గతం అయ్యాయని తెలిపారు. హేమ కమిటీ నివేదికలోని పలు విషయాలు చదివి తాను షాకయ్యానన్న ఆమె, మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూసి తన హృదయం ముక్కలైందన్నారు. లైంగిక వేధింపుల వ్యవహారంలో కేసులు నమోదవుతుండటం వల్ల పలువురు సినీనటులు, దర్శకులను సిట్ ప్రశ్నించే అవకాశముందని తెలుస్తోంది.
మరోవైపు మలయాళ నటుడు సిద్ధిఖీపై అత్యాచార కేసు నమోదైంది. 2016లో సిద్ధిఖీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ నటి ఆరోపించడం వల్ల పోలీసులు కేసు నమోదు చేశారు. మ్యూజియం పోలీస్ స్టేషన్‌లో సిద్ధిఖీపై సెక్షన్ 376 , 506 కింద FIR నమోదైనట్టు పోలీసులు తెలిపారు. నేరం 2016లో జరిగినందున IPC కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు.