Actor Turned Politician Vijay Speaks Against NEET Exam :నీట్‌కు వ్యతిరేకంగా తమిళగ వెట్రి కజగం వ్యవస్థాపకుడు, తమిళ స్టార్ నటుడు విజయ్ గళం విప్పారు. నీట్ నుంచి తమ రాష్ట్రానికి మినహాయింపు కోరుతూ తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన తీర్మానానికి విజయ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 10, 12వ తరగతుల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్థులను సన్మానించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన విజయ్, నీట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను రాష్ట్ర జాబితాలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
తమిళనాడులో పేదలు, గ్రామీణ ప్రాంతాల్లో బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు నీట్ పరీక్ష వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతున్నారని విజయ్ అన్నారు. 1975లో విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారని, రాష్ట్రాల హక్కులకు ఇది పూర్తిగా విరుద్ధమని ఆయన అన్నారు. రాష్ట్ర సిలబస్‌లో స్థానిక భాషలో చదివిన విద్యార్థి, NCERT పాఠ్యాంశాల ఆధారంగా రూపొందించిన సెంట్రల్ పరీక్షలో ఎలా రాణించగలడని విజయ్ ప్రశ్నించారు. ఒకే దేశం, ఒకే పాఠ్యాంశాలు ఉండకూడదని విజయ్ సూచించారు. పాఠ్యప్రణాళిక రాష్ట్రానికి సంబంధించిన అంశంగా ఉండాలని, విభిన్న దృక్కోణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వైవిధ్యమే బలమని, అది బలహీనత కాకూడదని అన్నారు.