Abhijit Gangopadhyay Joins BJP : కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ బీజేపీలో చేరనున్నారు. బంగాల్‌లో టీఎంసీ 'అవినీతి'కి వ్యతిరేకంగా పోరాడుతున్న బీజేపీలో చేరుతున్నట్లు ఆయన మంగళవారం కోల్కతాలో ప్రటించారు. మార్చి 7 మధ్యాహ్నం బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలిపారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అధిష్ఠానం ఏ స్థానాన్ని కేటాయిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీయే, తనను రాజకీయాల్లోకి వచ్చేలా చేసిందన్నారు.
"గత రెండేళ్లుగా విద్యా రంగంలోని కొన్ని కీలక కేసులను విచారిస్తున్నాను. ఇందులో భారీ అవినీతి బయటపడింది. ప్రభుత్వంలోని ప్రముఖ వ్యక్తులు సైతం జైలు పాలయ్యారు. నా మనఃసాక్షి ప్రకారమే ఉద్యోగానికి రాజీనామా చేశాను. ప్రజల సంక్షేమం కోసమే రాజకీయాల్లోకి వస్తున్నాను."
--జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి
రాష్ట్రపతి, సీజేఐకి రాజీనామా లేఖ
అంతకుముందు ఉదయం తన రాజీనామాను రాష్ట్రపతికి పంపించినట్లు అభిజిత్ వెల్లడించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సైతం రాజీనామా లేఖ ప్రతులను పంపినట్లు వివరించారు. బంగాల్‌లో విద్యారంగానికి సంబంధించి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ ఇటీవల ఇచ్చిన పలు తీర్పులు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణపై విచారణ జరపాలంటూ ఈడీ, సీబీఐని ఆదేశించారు. ఆయన తీర్పులపై అధికార పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు వార్తలు వచ్చాయి.
2018 మే నెలలో కలకత్తా హైకోర్టు అదనపు జడ్జిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్, 2020 జులైలో పూర్తిస్థాయి జడ్జిగా పదోన్నతి పొందారు. ఈ ఏడాది చివర్లో పదవీ విరమణ ఉన్నప్పటికీ ముందస్తుగానే రాజీనామా చేస్తున్నట్లు ఆదివారమే ప్రకటించారు. సోమవారమే తన చివరి పని దినమని చెప్పారు. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారనే కథనాలు వెలువడ్డాయి. తాజాగా వాటిని నిజం చేస్తూ బీజేపీలో చేరనున్నట్లు వెల్లడించారు.
'రాజీనామా చేస్తున్నా- ఆ విషయంపై అప్పుడే మాట్లాడతా'- కలకత్తా హైకోర్టు జడ్జి సంచలన నిర్ణయం
ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషే- మావోయిస్టులతో సంబంధాల కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు