Delhi Assembly Polls 2025 :దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు మూడు పార్టీలు పోటాపోటీగా పార్టీలు ఉచితాలను ప్రకటించాయి. ఇక్కడ ఒక అడుగు ముందుకేసి ఎన్నికలకు ముందుగానే పార్టీలు అర్హులను గుర్తించే దరఖాస్తుల ప్రక్రియను చేపట్టాయి. గతంలోనే ఉచిత హామీలతో రెండుసార్లు విజయం సాధించిన ఆప్ ఈసారి మరిన్ని గ్యారంటీలను ఇచ్చింది. ఆప్‌నకు పోటీగా బీజేపీ ఉచిత వరాల వాన కురిపించింది. కాంగ్రెస్ పార్టీ తాను తక్కువ తిన్నానా అన్నట్లు ఉచితాలను కుమ్మరించింది. కులగణన చేపడతామని హామీ ఇచ్చింది. ఎన్నికలు సమీపించిన వేళ చివర్లో కేంద్ర బడ్జెట్‌లో ఆదాయ పన్ను మినహాయింపును రూ.12 లక్షలకు పెంచడం ద్వారా బీజేపీ బౌన్సర్ వేసింది.
ఆప్‌నకు సవాల్
అధికార ఆప్‌నకు దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఒకరకంగా సవాలే అని చెప్పొచ్చు. పలువురు ఆప్ నేతలపై అవినీతి ఆరోపణలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. బీజేపీ ఈ విషయానే ప్రచార అస్త్రంగా మార్చుకుంది. విద్య, వైద్యంలో చేపట్టిన చర్యలతోపాటు ఉచిత విద్యుత్, తాగునీరు గత రెండు ఎన్నికల్లో అద్భుత ఫలితాలనిచ్చాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమూ ఫలించింది. ఈసారీ అదే బాటలో ఆప్ పయనిస్తోంది. మహిళలకు నెలకు రూ.2,100 చొప్పున ఇస్తామని ప్రకటించింది. దిల్లీలో చాలా మంది ఓటర్లు కలుషిత నీరు, దారుణమైన రోడ్ల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలతాయన్న ఆందోళన ఆప్‌లో ఉంది. కాంగ్రెస్ తమను దెబ్బ తీస్తుందేమోనన్న భయం ఆ పార్టీని వెంటాడుతోంది.