Man throws 2 kids Into well :కామారెడ్డి జిల్లాలో దసరా పండుగ పూట ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. జిల్లాలోని తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలతో సహా వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. తొలుత బావిలో ఇద్దరి పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. కొంత సేపటి తర్వాత ఆ ఇద్దరి పిల్లల తండ్రి మృతదేహాన్ని కూడా గజ ఈతగాళ్లు వెతికి బయటకు తీశారు. ఆత్మహత్యకు కారణం కుటుంబ కలహాలే అని తెలుస్తోంది. ఈ ఉదంతం శనివారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి :నందివాడకు చెందిన చిట్టపు శ్రీనివాస రెడ్డికి ఇద్దరు పిల్లలు. దసరా పండుగ సందర్భంగా తండ్రితో కలిసి బయటకు వెళ్లారు. రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వారి కోసం గాలించారు. ఇద్దరు పిల్లలు ఓ వ్యవసాయ బావిలో విగత జీవులుగా కనిపించారు. చిట్టపు శ్రీనివాస్ రెడ్డి తన పిల్లలను బావిలో తోసేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.