Criminal Cases On Sitting MLAs And MPs :దేశంలోని 151 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని ప్రముఖ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్ (ADR) వెల్లడించింది. అందులో బంగాల్‌కు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారని తెలిపింది. దేశవ్యాప్తంగా 151 మంది చట్టసభ్యుల్లో 16 మందిపై అత్యాచార ఆరోపణలు కూడా ఉన్నట్లు ప్రకటించింది. బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన చెరో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్నారని చెప్పింది.
2019-2024 మధ్య ఎన్నికల సమయంలో భారత ఎన్నికల కమిషన్‌కు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమర్పించిన 4809 అఫిడవిట్లలో 4,693 విశ్లేషించి ఈ నివేదిక రూపొందించినట్లు ఏడీఆర్ పేర్కొంది. అందులో మహిళలపై నేరాలకు సంబంధించి కేసులు ఎదుర్కొంటున్న 16 మంది ఎంపీలు, 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు గుర్తించింది. బంగాల్‌కు చెందిన 25 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అందులో ఉన్నారని తెలిపింది. 21 మంది చట్టసభ్యులతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని నివేదికలో పేర్కొంది. ఒడిశాకు చెందిన వారు 17 మంది ఉన్నట్లు చెప్పింది.
ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ!
దేశంలోని 16 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అత్యాచారం కేసులు ఎదుర్కొంటున్నారని, వీరిపై నేరాలు రుజువైతే 10 ఏళ్లు లేదా జీవిత కారాగార శిక్ష పడే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది. అత్యధికంగా 54 మంది బీజేపీ నేతలు ఈ తరహా కేసులు ఎదుర్కొంటుండగా, 24 మంది కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జరిగిన జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఈ నివేదిక వెలువడడం గమనార్హం.