తొమ్మిదేళ్ల నిర్మాణం, 9సెకన్లలో స్మాష్, నష్టం ఎంతో తెలుసా - నోయిడా జంట భవనాల కేసు
🎬 Watch Now: Feature Video
noida twin towers నోయిడాలో జంట టవర్ల కూల్చివేత వంద శాతం విజయవంతమైందని ఈ ప్రక్రియ చేపట్టిన 'ఎడిఫిస్ ఇంజినీరింగ్' సంస్థ తెలిపింది. ఆదివారం సరిగ్గా మధ్యాహ్నం 2:30 గంటలకు వాటిని కూల్చివేశారు. అంతకుముందే స్థానికులందరినీ అక్కడి నుంచి తరలించారు. ఈ జంట భవనాల కూల్చివేతకు 3,700 కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించారు. రెండు భవంతులు నేలమట్టమైన అనంతరం సంస్థ ప్రతినిధి చేతన్ దత్తా మీడియాతో మాట్లాడారు. అనుకున్న ప్రకారమే భవనాలు కుప్పకూలాయని వెల్లడించారు. 'కూల్చివేత సమయంలో భవనాల నుంచి కేవలం 70 మీటర్ల దూరంలో ఉన్నా.. ఈ ప్రక్రియ వంద శాతం విజయవంతమైంది. ఐదు నిమిషాల అనంతరం కూలిపోయిన భవనాలను పరిశీలించాం. అంతా అనుకున్నట్టుగానే సాగింది. పక్కనే ఉన్న ఎమరాల్డ్ కోర్టు నివాస సముదాయానికి ఎటువంటి నష్టం వాటిల్లలేదు. మరోవైపు ప్రహరీ స్వల్పంగా దెబ్బతింది. నాలుగైదు మీటర్లు కూలిపోయింది' అని తెలిపారు. 30-35 మంది ఎడిఫిస్ సిబ్బంది, ఏడుగురు విదేశీ నిపుణులు కూల్చివేత ప్రక్రియను పర్యవేక్షించినట్లు చేతన్ దత్తా వెల్లడించారు. అయితే, కేవలం 9 సెకన్ల వ్యవధిలోనే.. తొమ్మిదేళ్లు పాటు నిర్మించిన జంట భవనాలు కుప్పకూలాయి. నోయిడాలో జంట భవనాల కూల్చివేతపై సూపర్‌టెక్ ఛైర్మన్ ఆర్‌కే అరోడా స్పందించారు. ఈ కూల్చివేతల ద్వారా తమ కంపెనీకి రూ.500 కోట్లు నష్టం వాటిల్లిందని వెల్లడించారు. ఈ జంట భవనాల నిర్మాణం, వడ్డీ రేట్లు తదితరాలన్నింటితో కలుపుకొంటే తమ సంస్థకు ఆ మేరకు నష్టం వాటిల్లినట్టు చెప్పారు. ఈ జంట భవనాల కూల్చివేత ఆపరేషన్ కోసం 3700 కిలోల పేలుడు పదార్థాలను వినియోగించగా.. రూ.20 కోట్లు ఖర్చు చేసినట్టు అంచనా.