గేదె దెబ్బకు ఊరంతా హడల్.. పట్టుకునేందుకు వెళ్లి యువకుడు మృతి - వైరల్ వీడియోలు
🎬 Watch Now: Feature Video
కేరళలోని కాసరగోడ్ జిల్లాలో ఓ గేదె బీభత్సం సృష్టించింది. వీధుల్లో విచక్షణరహితంగా తిరుగుతూ.. హల్చల్ చేసింది. గేదె దాడిలో ఓ యువకుడు మృతి చెందాడు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొగ్రాల్ పుత్తూరు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దాదాపు మూడు గంటలకు పైగా.. గేదె బీభత్సం సృష్టించింది. గురువారం సాయత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో స్థానికులంతా కాసేపు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
బీభత్సం సృష్టించిన గేదెను పట్టుకునేందుకు స్థానికులంతా ప్రయత్నించారు. తాళ్లతో బంధించాలని చూశారు. ఈ ప్రయత్నంలో సాదిక్ అనే 22 ఏళ్ల యువకుడిని గేదె కొమ్ములతో పొడిచింది. దీంతో సాదిక్ తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు కర్ణాటకలోని చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన వాడని స్థానికులు తెలిపారు. గేదె దాడిలో రెండు షాపులు ధ్వంసం అయ్యాయి. మరికొన్ని వాహనాలు దెబ్బతిన్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు గేదెను పట్టుకున్నారు. దానిని బంధించి వేరే ప్రాంతానికి తరలించారు.