'నేనేం అనలేదు అక్క.. క్షమించి వదిలెయ్ ప్లీజ్..' - మహబూబాబాద్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video

మహిళలను చూడగానే ఏదో ఒకటి అంటుంటారు కొందరు ఆకతాయిలు. వాళ్లేం చేస్తారులే, ఏదైనా అనొచ్చు అనే ధోరణిలో కొందరు వ్యక్తులు అలా ప్రవర్తిస్తుంటారు. బైక్‌లపై వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి కామెంట్ చేస్తే.. వాళ్లు ఆగి ఏం అంటారులే అనే దీమాతో అసభ్యంగా మాట్లాడుతుంచారు. కానీ.. అన్నిసార్లు వాళ్లు అనుకున్నట్లు ఉండదుగా. మహిళలు తిరగబడ్డప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది.
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయిని చెప్పుతో కొట్టి దేహశుద్ధి చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. మహబూబాబాద్ పట్టణంలో తన భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ మహిళతో.. వెనుక నుంచి మరో బైక్‌పై వస్తున్న యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే ద్విచక్ర వాహనాన్ని ఆపించి కిందకు దిగిన ఆ మహిళ.. నడిరోడ్డుపైనే ఆ యువకుడికి దేహశుద్ధి చేసింది. జుట్టు పట్టుకుని చెప్పుతో చితక్కొట్టింది. పక్కన ఉన్నవారు ఆపే ప్రయత్నం చేసినా.. ఆగకుండా ఎడాపెడా దంచింది. 'నేనేం అనలేదు అక్క.. క్షమించి వదిలెయ్ ప్లీజ్' అని వేడుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది.