Woman Harassement Case On CID DSP : 'చీరలో ఉన్న ఫొటోలు పంపించు'.. మహిళా ఉద్యోగికి సీఐడీ అధికారి వేధింపులు!
🎬 Watch Now: Feature Video
Harassement Case On CID DSP Kishan Singh : ప్రజలకు ఏదైనా కష్టం వస్తే.. కాపాడాల్సిన రక్షక భటుడే ఆమె పాలిట శాపంగా మారాడు. సమస్య ఉందని వెళ్తే.. అతడే సమస్యగా మారి వేధింపులకు గురి చేశాడో పోలీసు. నీతో స్నేహం కావాలంటూ, నీ ఫొటోలు పంపించంటూ నానా ఇబ్బందులకు గురి చేశాడో ఉన్నతాధికారి. బాధితురాలు అనురాధ తెలిపిన వివరాల ప్రకారం.. తన భర్త ఉదయ్ కుమార్ విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పని చేస్తూ 2010లో చనిపోవడంతో అతని ఉద్యోగం తనకు వచ్చిందని, ప్రస్తుతం తాను అదే శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నానని తెలిపారు. ఈ క్రమంలోనే గతంలో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో మార్నింగ్ వాకింగ్ చేసే సమయంలో తనకు సీఐడీ డీఎస్పీ కిషన్సింగ్తో పరిచయం ఏర్పడిందన్నారు. పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న కిషన్‌సింగ్.. తనను లైంగికంగా వేధించడం మొదలుపెట్టారని ఆమె వివరించారు. అతని ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో మాట్లాడటం మానేశానని చెప్పారు. అయితే ఇటీవల ఓ కేసు విషయమై ఇటీవల ఆయనతో మాట్లాడానని.. అప్పటి నుంచి మళ్లీ తనకు వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ తనతో చనువుగా ఉండాలని, చీరలో ఉన్న ఫొటోలు పంపాలని మెసేజ్‌లు పెడుతున్నాడంది. ఇది సరైన పద్ధతి కాదని చెప్పినా వినకపోవడంతో షీ-టీమ్‌ను ఆశ్రయించానని.. షీటీమ్ అధికారుల సూచన మేరకు చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.