Fish Tunnel at Bandlaguda Jagir : ఆకట్టుకునేలా 'ఫిష్ టన్నెల్'.. ఫ్యామిలీతో ఓసారి వెళ్లి చూసొద్దామా? - చిన్న పిల్లలు కేరింతలు కొట్టే ఎగ్జిబిషన్
🎬 Watch Now: Feature Video
Under Water Fish Tunnel in Bandlaguda Jagir : ఇంట్లోని అక్వేరియంలో నాలుగైదు రకాల చేపల్ని చూస్తేనే చిన్నారులు కేరింతలు కొడుతుంటారు. అలాంటిది ఒకేచోట వేల రకాల చేపలను చూస్తే.. వారి ఆనందానికి అవధులుండవు. మనం నడుస్తూ ఉంటే.. రెండు పక్కలా, పైన.. చేపలు పరిగెడుతుంటే చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది కదూ. ఆ దృశ్యం కళ్లముందు ప్రత్యక్షమైతే చూడ్డానికి రెండుకళ్లు సరిపోవు. అచ్చం ఇలాంటి దృశ్యం ఇప్పుడు భాగ్యనగరంలో ఆవిష్కృతమైంది. కుటుంబ సమేతంగా అస్వాదించేందుకు బండ్లగూడ జాగీర్ స్వాగతం పలుకుతోంది.
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్‌లో పది రోజుల పాటు జరగనున్న ఈ అండర్ వాటర్ టన్నెల్ ఎగ్జిబిషన్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకోనుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అంతా కలిసి సంతోషంగా వీక్షించే విధంగా.. బండ్లగూడ జాగీర్‌లో అండర్ వాటర్ టన్నెల్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసినట్లుగా నిర్వాహకుడు రాజారెడ్డి తెలిపారు. ఈనెల 25వ తేదీ నుంచి ఈ వాటల్ టన్నెల్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. దుబాయ్, సింగపూర్లలో ఉండే అండర్ వాటర్ టన్నెల్ షోను మొదటి సారిగా కూకట్‌పల్లిలో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అండర్ వాటర్ టన్నెల్ ప్రదర్శనతో పాటు హ్యాండ్లూమ్ స్టాల్లను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. పది రోజుల పాటు కొనసాగే ఈ వాటర్ టన్నెల్ షోను రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని చెప్పారు. రకరకాల జలచరాలను ఈ ప్రదర్శనలో వీక్షించవచ్చని ఆయన తెలిపారు.