ఇంటి గోడపై పులి- 8 గంటలు డ్రామా! గ్రామస్థులు తరిమినా బెదరకుండా రిలాక్స్ - గోడపై పులి వీడియో
🎬 Watch Now: Feature Video
Published : Dec 26, 2023, 3:02 PM IST
|Updated : Dec 26, 2023, 3:54 PM IST
Tiger Sitting On Wall Video : అడవి నుంచి బయటకు వచ్చిన పులి ఓ ఇంటి గోడపై తాపీగా సేదతీరడం స్థానికుల్లో భయాందోళనలు కలిగించింది. ఉత్తర్‌ప్రదేశ్ పీలీభీత్ జిల్లాలోని కలీనగర్లో ఈ ఘటన జరిగింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత 2 గంటల సమయంలో ఓ రైతు ఇంటి గోడపై పులి కనిపించగా శునకాలు దాన్ని చూసి అరవడం మొదలుపెట్టాయి. దీంతో రైతు బయటకు వచ్చి చూశాడు. పులిని చూసి భయపడిన అతడు స్థానికులకు సమాచారం ఇచ్చాడు.
రైతు ఇంటి వద్దకు చేరుకుని పులిని తరిమేసేందుకు గ్రామస్థులు అనేక ప్రయత్నాలు చేశారు. కొందరు మంట వెలిగించగా మరికొందరు పులి కళ్లలోకి టార్చిలైట్ కొట్టి దాన్ని భయపెట్టే ప్రయత్నం చేశారు. కానీ, పులి మాత్రం అక్కడ్నుంచి కదల్లేదు. మంగళవారం ఉదయం వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. కొద్దిసేపు గోడపై నిల్చున్న పులి, కాసేపటికి దానిపైనే నిద్రపోయింది. అక్కడికి వచ్చే జనాల సంఖ్య పెరిగినప్పటికీ పులి మాత్రం బెదరలేదు. గ్రామస్థులు ఈ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
గ్రామస్థుల సమాచారంతో అటవీశాఖకు చెందిన అధికారులు పులిని రక్షించేందుకు రంగంలోకి దిగారు. మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో పులిని అదుపులోకి తీసుకున్నారు. పులికి మత్తుమందు ఇచ్చి బంధించారు. వైద్య పరీక్షల అనంతరం పులిని అడవిలో విడిచిపెడతామని పీలీభీత్ టైగర్ రిజర్వ్ డిప్యూటీ డైరెక్టర్ నవీన్ ఖండెల్వాల్ తెలిపారు.
గాండ్రిస్తూ దూసుకొచ్చిన పెద్దపులి.. భయంతో వణికిపోయిన టూరిస్ట్‌లు.. చివరకు ఏమైంది?