శక్తి స్వరూపిణీ అనుగ్రహం కోసం జగిత్యాలలో శతచండీ యాగం - జగిత్యాలలో దుర్గాదేవి అమ్మవారి విగ్రహ ఊరేగింపు
🎬 Watch Now: Feature Video
Published : Nov 6, 2023, 10:10 AM IST
Satha Chandi Yagam Performs In Jagtial : జగిత్యాల జిల్లాలో శతచండీ యాగ మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ముఖ్య శిష్యులైన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య సమక్షంలో ఆదివారం హోమం జరిపించారు. దేవీ పురాణ ప్రవచకులు, వేద, జ్యోతిష్య పండితులు తిగుళ్ల విశ్వనాథ శర్మ ఆధ్వర్యంలో పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన శతచండీ హోమ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కుల, మత ప్రాంతాలకు అతీతంగా అందరికీ మంచి జరగాలంటే యజ్ఞయాగాలు నిర్వహించాలని.. దీంతో ఐక్యతతో పాటు మానవ సంబంధాలు మనుగడ సాగిస్తాయని వేణుగోపాలాచారి తెలిపారు.
సర్వ విఘ్నాలు పోవడానికి మహా గణపతికి లక్ష దుర్వార్చన, మహాశివుడికి లక్ష బిల్వార్చన నిర్వహించారు. వేద పండితులతోపాటు 36 మంది రుత్విక్కులు ఈ శతచండీ యాగంలో పాల్గొన్నారు. ఉత్సవాల ప్రారంభవేళ వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మహిళల కోలాటాలతో జగిత్యాల పుర వీధుల్లో దుర్గాదేవి అమ్మవారి విగ్రహ శోభాయాత్ర అద్భుతంగా సాగింది.