New Trends in Elections Campaign in Telangana : కటౌట్లు, ఫ్లెక్సీలు పాయే.. ఎల్‌ఈడీ తెరలు వచ్చే.. ఎన్నికల ప్రచారంలో నయా ట్రెండ్.. - ఎన్నికల ప్రచారానికి కొత్త విధానాలు
🎬 Watch Now: Feature Video
Published : Oct 15, 2023, 1:57 PM IST
New Trends in Elections Campaign in Telangana : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. అధికార పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించగా.. మిగతా పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసి వారి వివరాలు వెల్లడించే పనిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. గతంతో పోలిస్తే ఈసారి నిర్వహించే ఎన్నికల ప్రచారం నూతన ఒరవడులను అంది పుచ్చుకుంటుంది. ఎన్నికల ప్రచారం సాంకేతిక పుంతలు తొక్కుతుంది. ఓటర్లను ఆకర్షించేందుకు నేతలు ఎప్పటికప్పుడు నూతన మార్గాలు అన్వేషిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారాల్లో భాగంగా సాధారణంగా కూడళ్లలో కటౌట్లు, ఫ్లెక్సీలు పెడుతుంటారు. ఈ మధ్య వాటికి బదులుగా ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా మార్కెట్లోకి నడిచే ఎల్ఈడీ ప్రచార ఫలకలూ అందుబాటులోకి వచ్చాయి. వీటిని వ్యక్తులు భుజానికి తగిలించుకుని ఊరంతా తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేయొచ్చు. చీకట్లోనూ ఈ తెరలపై ఉండే బొమ్మలు, రాతలు స్పష్టంగా కనిపిస్తాయి. వీటికి 2 గంటల పాటు ఛార్జింగ్ పెడితే.. 5 గంటల వరకు పని చేస్తాయని చెబుతున్నారు. ఈ నూతన ఎన్నికల ప్రచార తెరలు సికింద్రాబాద్ కేంద్రంగా తయారవుతున్నాయి. వీటిపై అన్ని జిల్లాల నాయకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ తెరల ప్రచారం రానున్న రోజుల్లో మరింత విస్తృతం కానుంది.