'పనిమంతుడు పందిరి వేస్తే కుక్క తోక తగిలి కూలిందన్నట్లు అయ్యింది' - మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన్ కేంద్ర కమిటీ
🎬 Watch Now: Feature Video
Published : Nov 3, 2023, 5:20 PM IST
MP Laxman on Medigadda Barrage Issue : మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్(MP Laxman) అన్నారు. దీనిపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ కేంద్రానికి నివేదిక సమర్పించిందని పేర్కొన్నారు. ప్లానింగ్, డిజైన్, నాణ్యత నియంత్రణ, నిర్వహణ లోపాలవల్లే కుంగుబాటు జరిగిందని చెప్పారు. పునాది కింద ఇసుక కొట్టుకుపోయి పిల్లర్లు బలహీనపడ్డాయన్నారు. ఫౌండేషన్ మెటీరియల్ పటిష్ఠత తక్కువగా ఉండటం మరో కారణమని వివరించారు. బ్యారేజీ ప్లానింగ్, డిజైన్ సరిగా లేకపోవడం వైఫల్యమేనని నివేదిక చెప్పిందని ఆయన తెలిపారు. డ్యామ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ బలహీనపడుతోందని స్పష్టం చేశారు.
Medigadda Barrage Damage Issue : ఒక బ్లాకులో సమస్య, మొత్తం బ్యారేజీకే ముప్పు తెచ్చిందన్న లక్ష్మణ్.. సమస్య పరిష్కరించకుండా బ్యారేజీని ఉపయోగించలేమని కమిటీ పేర్కొందన్నారు. మొత్తం బ్లాకును పునాదుల నుంచి తొలగించి మళ్లీ కట్టాలని కమిటీ చెప్పిందని తెలిపారు. కాళేశ్వరంపై అధికారుల నుంచి 20 అంశాలపై కమిటీ సమాచారం కోరిందని చెప్పారు. కోరిన మొత్తం సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని కమిటీ చెప్పిందన్నారు. 12 అంశాల సమాచారమే ఇచ్చారని కమిటీ పేర్కొందని ఎంపీ లక్ష్మణ్ వివరించారు. రూ.35 వేల కోట్లతో ప్రతిపాదించిన రూ.లక్షన్నర కోట్లకు తీసుకెళ్లారన్నారు. మూడేళ్లలోనే హడావుడిగా కాళేశ్వరం నిర్మించారని.. నిర్మించిన మూడేళ్లకే కాళేశ్వరం బండారం బయటపడిందని విమర్శించారు. ప్రాజెక్టు కుంగినప్పటికీ మంత్రులు నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారని మండిపడ్డారు. డీపీఆర్ కూడా ఇవ్వని ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని మాట్లాడారని తెలిపారు. పనిమంతుడు పందిరి వేస్తే.. కుక్క తోక తగిలి కూలిందన్నట్లు అయ్యిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల రూ.లక్షల కోట్ల సంపద వృథాగా ఆవిరైపోతోందని లక్ష్మణ్ ఆరోపించారు.