కొత్త పార్టీ పెడుతున్న ఎంపీ కోమటిరెడ్డి.. నిజమెంత..?
🎬 Watch Now: Feature Video
MP Komatireddy clarity on his New Party : భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీ మారనున్నట్లు గతకొంతకాలంగా వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన ఓ కొత్త పార్టీ పెడుతున్న న్యూస్ వైరల్ అవుతోంది. దీనిపై ఎంపీ స్పందించి.. క్లారిటీ ఇచ్చారు. తాను కొత్త పార్టీ పెడుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను వెంకట్ రెడ్డి ఖండించాడు.
నిరాధార వార్తలతో కాంగ్రెస్ కార్యకర్తలను అయోమయానికి గురిచేసేలా కొందరు ప్రచారం చేస్తున్నారన్నారని వెంకట్ రెడ్డి ఆరోపించారు. పార్టీనీ మారేవాడిని అయితే పీసీసీ పదవి ఇవ్వనప్పుడే మారేవాడినని.. ఇప్పుడెందుకు మారతానని అన్నారు. పార్టీ ఆదేశిస్తే మళ్లీ ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారు. తనకు హస్తం పార్టీలో మంచి పదవి వస్తుందని ఆశిస్తున్నానని.. కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులను కలిసినా.. అది అభివృద్ధి కార్యక్రమాల కోసమేనని వివరణ ఇచ్చారు. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచారం చేయటం తగదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హితవు పలికారు.
"నిరాధారమైన వార్తలతో.. కాంగ్రెస్ క్యాడర్ను, 33 సంవత్సరాలుగా నన్ను నమ్ముకొని బతుకుతున్న లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలను అయోమయంలో పడేయొద్దు. పార్టీ మారడం.. కొత్త పార్టీ పెట్టడం లాంటిదేమైనా ఉంటే నేనే ప్రకటిస్తాను తప్ప మీ అంతట మీరు వార్తలు క్రియేట్ చేయకండి. అధిష్టాన వర్గం మీద కామెంట్స్ చేసిన మాట వాస్తవమే. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలతో మాట్లాడాను. భవిష్యత్లో నా సేవలను వినియోగించుకుంటామని చెప్పారు. పార్టీ మారే ప్రసక్తే లేదు. రాహుల్ గాంధీ అనర్హత విషయంలో గాంధీ భవన్లో జరిగిన సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నాను. రోహిత్ చౌదరీ, నేను, ఠాక్రే కలిసి 2గంటల పాటు సమావేశమయ్యాం. పార్టీ వీడుతున్నాననే అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు" - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ