ఆదిలాబాద్లో పులుల సంచారం.. వైరల్ అవుతున్న దృశ్యాలు - రోడ్డుమీద నాలుగు పులులు సంచారం
🎬 Watch Now: Feature Video
Four Tigers Roam In Adilabad District: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని గొల్లఘాట్ శివారులో మళ్లీ పులుల సంచారం కలకలం రేపుతోంది. గురువారం అర్ధరాత్రి నాలుగు పులులు రోడ్డు దాటాయి. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి పులులు రోడ్డు దాటడం చూశాడు. వెంటనే తన సెల్ఫోన్లో ఆ దృశ్యాలను చిత్రీకరించాడు. ప్రస్తుతం పులులు సంచరిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Footage of tigers wandering in Adilabad : పిప్పల్ కోటి రిజర్వాయర్ పనుల కోసం ఓ డ్రైవర్ మట్టి తరలిస్తున్నాడు. ఈ క్రమంలో గొల్లఘాట్కు చేరుకోగానే నాలుగు పులులు రోడ్డు దాటడం గమనించాడు. వెంటనే ఆ దృశ్యాలను తన మొబైల్ ఫోన్లో రికార్డు చేశాడు. వెంటనే బ్యారేజీ పనుల పర్యవేక్షణ అధికారికి సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న అధికారి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు.
Tigers wander in GollaGhat village : పులులు సంచరిస్తున్న విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. పులులు రోడ్డు దాటుతున్న దృశ్యాలను గమనించారు. పులుల అడుగులను పరిశీలించారు. అవి సంచరిస్తోందని నిజమేనని నిర్ధారించుకున్నారు. గొల్లఘాట్ గ్రామ పరిసర ప్రాంతాల ప్రజలు రాత్రి పూట అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించారు. పులులను పట్టుకునేంత వరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు చెప్పారు.
Tigers wander in Adilabad district : రెండు నెలల కిందట ఇదే ప్రాంతంలో నాలుగు పులులు సంచరించిన విషయం తెలిసిందే. తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి పెన్ గంగ దాటి తరచూ ఈ ప్రాంతానికి పులులు వస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల పనులపై బయటకు వెళ్తున్న వారిని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల పులులు మూగజీవాలపై కూడా దాడికి తెగబడుతున్నాయి. పులుల సంచారంతో పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏ సమయంలో ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయోనని భయపడుతున్నారు. వీలైనంత త్వరగా పులులను పట్టుకోవాలని అటవీ అధికారులను కోరుతున్నారు.