MLA Mynampally on Harish Rao : మెదక్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యేకే.. హరీశ్ రావుపై తీవ్ర విమర్శలు చేసిన మైనంపల్లి - హరీశ్‌రావు అడ్రస్ గల్లంతు చేస్తానన్న హన్మంతరావు
🎬 Watch Now: Feature Video
MLA Mynampally on Harish Rao : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుపై మేడ్చల్-మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మెదక్ నియోజకవర్గంలో మంత్రి హరీశ్‌రావు పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. మెదక్‌లో హరీశ్‌రావు నియంతగా వ్యవహరిస్తున్నారని.. ఆయన తన గతం గుర్తుంచుకోవాలన్నారు. సిద్దిపేట మాదిరిగా హరీశ్‌రావు మెదక్‌ను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించిన మైనంపల్లి.. హరీశ్‌రావు మెదక్ జిల్లా అభివృద్ధి కాకుండా చేశారని ఆరోపించారు.
MLA Mynampally on Medak Ticket : మంత్రి హరీశ్‌రావుపై మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆరోపణలు బీఆర్ఎస్లో కలకలం రేపాయి. మల్కాజ్‌గిరిలో తనను కొనసాగిస్తూనే.. తన కుమారుడుకి మెదక్ అసెంబ్లీ సీటు ఇవ్వాలని ఆయన అధిష్ఠానాన్ని కోరారు. అందుకు మెదక్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మాదేవేందర్ రెడ్డికే టికెట్ ఇవ్వడంతో మైనంపల్లి భగ్గుమన్నారు. దీని అంతటికీ కారణం హరీశ్‌రావునే అని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈమేరకు హరీశ్‌రావుకు తగిన బుద్ధి చెబుతానని ప్రతిజ్ఞ చేశారు. సిద్ధిపేటలో హరీష్ రావుకు అడ్రస్ లేకుండా చేస్తానంటూ ప్రమాణం చేశారు. మెదక్, మల్కాజిగిరిపై దృష్టిపెట్టనున్నట్లు పేర్కొన్నారు. మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యలను బీఆర్ఎస్ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. ఎమ్మెల్యేగా పోటీ చేయడం.. చేయకపోవడం ఆయన ఇష్టమని సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ కూడా మైనంపల్లి వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. మైనంపల్లిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం.