ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేయాలని కార్యకర్తలకు మంత్రి పొన్నం పిలుపు - కాంగ్రెస్ కార్యకర్తలతో పొన్నం ప్రభాకర్ మాటామంతి
🎬 Watch Now: Feature Video
Published : Dec 11, 2023, 6:50 PM IST
Minister Ponnam Welcome Program in Siddipet : రాష్ట్ర మంత్రిగా తొలిసారి సిద్దిపేటకు వచ్చిన పొన్నం ప్రభాకర్‌కు పొన్నాల వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రంగదంపల్లి చౌరస్తాలో అమరవీరుల స్థూపానికి పొన్నం నివాళులర్పించారు. ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను 100 రోజుల్లో ప్రారంభిస్తామని మరోసారి పొన్నం స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన నచ్చక మనకు అధికారం ఇచ్చారని, మనముందు మరెన్నో సవాళ్లున్నాయన్నారు. కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేసి ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రజా సమస్యలకు అత్యంత ప్రాధాన్యత ఇద్దామన్న మంత్రి, కాంగ్రెస్ పార్టీ మాటంటే మాట మీద నిలబడుతుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడటంలో గత పాలకులను, అధికారులను కలిసే పరిస్థితి లేదని, ఇక అలాంటి పరిస్థితులు ఉండవన్నారు. ప్రగతి భవన్ చూడడానికి గతంలో చూడని బీఆర్ఎస్ నాయకులు కూడా రావచ్చని ఆ పార్టీపై పరోక్షంగా నిట్టూర్చారు. బీసీ బంధుపై సమీక్షించి త్వరలోనే ఆలోచన చేస్తామని తెలిపారు. నేటికీ మూడు రాష్ట్రాల్లో గెలిచిన బీజేపీ సీఎంలను నియమించలేదని ఎద్దేవా చేశారు. విద్యుత్ శాఖలో రూ.85వేల కోట్ల అప్పు ఉందని, రాష్ట్రంలో ఉన్న ప్రతి శాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఒకేచోట జరుగుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.