Minister KTR Latest Tweet : 'హైదరాబాద్ వాసులకు ఇక తాగునీటి సమస్యే ఉండదు' - మంత్రి కేటీఆర్ వార్తలు
🎬 Watch Now: Feature Video
KTR Tweet on drinking water to Hyderabad : హైదరాబాద్ వాసులకు రాబోయే కాలంలో తాగునీటి సమస్యే ఉండదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలో పెరుగుతున్న తాగునీటి అవసరాలను తీర్చడానికి పూర్తి స్థాయిలో హైదరాబాద్ సన్నద్దమవుతోందని తెలిపారు. 2050వ సంవత్సరం వరకు ప్రతి ఏటా పెరిగే అవసరానికి అనుగుణంగా తాగునీటి సరఫరా ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. జంటనగరాల మెట్రో నీటి సరఫరా, మురుగునీటి బోర్డు.. సుంకిశాల వద్ద కృష్ణా నీటి సరఫరా మూడు దశల సామర్ధ్యాన్ని పెంచుతోందని కేటీఆర్ ట్వీట్ చేశారు. 2024 వేసవి నాటికి పూర్తయ్యే ఈ ప్రాజెక్టు కోసం 2,215 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
మరోవైపు తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దిన ఘనత... ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని మంత్రి పునరుద్ఘాటించారు. చుక్క నీటి కోసం అలమటించిన రోజుల నుంచి.. తెలంగాణ సాగునీటి రంగంలో స్వర్ణయుగం తీసుకురాగలిగామని చెప్పారు. తెలంగాణ జల విధానం.. దేశానికే ఆదర్శమని వివరించారు. ఉమ్మడి పాలనలో రైతులు సంక్షోభం ఎదుర్కొన్నారని మరోసారి గుర్తుచేశారు. కేసీఆర్ నిబద్ధతతో తెలంగాణ సాగునీటి రంగంలో స్వర్ణయుగం వచ్చిందన్న ఆయన.. చుక్కనీటి కోసం అల్లాడిన నేలకు ప్రతినిత్యం జలాభిషేకం చేస్తున్నామంటూ హర్షం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన పలు ప్రాజెక్టుల విశేషాలను మంత్రి ట్విటర్‌లో పంచుకున్నారు.