చెరకు రైతులకు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం కృషి : మంత్రి దామోదర - గోదావరి గంగ చక్కెర ఫ్యాక్టరీ
🎬 Watch Now: Feature Video
Published : Jan 12, 2024, 7:08 PM IST
Minister Damodara on Nizam Sugar Factory : చెరకు రైతులకు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం మాటూర్లో గోదావరి గంగా చక్కెర పరిశ్రమ నిర్మాణానికి ఎంపీ బీబీ పాటిల్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి, అదనపు కలెక్టర్ మాధురితో కలిసి భూమి పూజ చేశారు. జహీరాబాద్ ప్రాంత చెరకు రైతుల కష్టాలు తీర్చేందుకు కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తుందని తెలిపారు. చక్కెర పరిశ్రమ క్రషింగ్ ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు.
ట్రైడెంట్ పరిశ్రమ పునఃప్రారంభానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. దీంతో పాటు నిజాం చక్కెర కర్మాగారం ప్రారంభించేందుకు మంత్రి శ్రీధర్ బాబు నేతృతంలో కమిటీ పని చేస్తోందని చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగా మళ్లీ రాయితీపై బిందు తుంపర సేద్యం పరికరాలు పంపిణీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గోదావరి గంగా చక్కెర పరిశ్రమలో స్థానిక యువతకు విద్యార్హతలు బట్టి మొదటి ప్రాధాన్యతగా ఉద్యోగాలు కల్పించాలని మంత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. చెరకు పంటపై ఆధారపడే రైతుల కోసం కొత్త పరిశ్రమ ఏర్పాటునకు ముందుకు వచ్చిన యాజమాన్యం గోయల్ కుటుంబానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.