200 కిలోల 'ప్యాలెస్ కేక్'తో పుణె మహిళ రికార్డ్ - PUNE CAKE
🎬 Watch Now: Feature Video
సాధారణంగా కేకును చూస్తేనే నోరూరిపోతుంది. అది 200 కేజీల కేకు అయితే మరింత ఆసక్తి ఖాయం. మరి ఆ కేకు రాజభవనం ఆకారంలో ఉంటే అదో అద్భుతమే. ఇలాంటి అద్భుతాలను సృష్టిస్తోంది మహారాష్ట్ర పుణెకు చెందిన కేకు తయారీ కళాకారిణి ప్రాచీ దహబల్ దేబ్. అత్యంత సున్నితమైన, సంక్లిష్టమైన రాయల్ ఐసింగ్ విధానంలో రాణిస్తున్నారు ఈ భారతీయ మహిళ. కేకులతో అద్భుతమైన ఆకృతులను రూపొందిస్తూ ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంటున్నారు. తాజాగా ఈమె సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. భారతీయ రాజభవనం నమూనాలో 200 కేజీల కేకును రాయల్ ఐసింగ్ విధానంలో తయారు చేశారు.
వీగన్ రాయల్ ఐసింగ్‌లో ఆరితేరిన ప్రాచీ పుణెలోని పింప్రి చించ్వాడ్‌లో నివాసం ఉంటున్నారు. భారతీయ శిల్పకళా సంపదను ప్రతిబింబించేలా ఆమె రూపొందించిన 200 కేజీల కేకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించింది. అతిపెద్ద వీగన్ రాయల్ ఐసింగ్ విభాగంలో ఈ రికార్డును ఆమె సొంతం చేసుకున్నారు. ప్రాచీ పేరిట మరో రెండు రికార్డులు కూడా ఉన్నాయి. గతంలో మిలాన్ కేథడ్రల్ నమూనాలో 100 కేజీల కేకును రూపొందించి ఆమె రికార్డును నెలకొల్పారు. అత్యధిక వీగన్ రాయల్ ఐసింగ్ ఆకృతులను రూపొందించినందుకు మరో ప్రపంచ రికార్డు కూడా ఆమె పేరు మీదే ఉంది.
బ్రిటన్ రాజకుటుంబం కోసం తయారుచేసే కేకులను అలంకరించడానికి రాయల్ ఐసింగ్‌ను ఉపయోగిస్తారు. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన కళ. అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ కూడా. ఎంతో సహనంతో ప్రాచీ ఈ కళపై నైపుణ్యం సాధించారు. 11 ఏళ్ల క్రితం కేకు ఆర్టిస్ట్‌గా జీవితం ప్రారంభించిన ప్రాచీ.. రాయల్ ఐసింగ్ గురించి తెలుసుకుని లండన్‌లో ఈ కళను నేర్చుకున్నారు. భారతీయ కస్టమర్ల కోసం ప్రాచీ వీగన్ రాయల్ ఐసింగ్ రెసిపీలను ప్రత్యేకంగా రూపొందించారు. భారతీయుల ఆహారపు ఆలవాట్లకు అనుగుణంగా వీగన్ పద్ధతిలో రాయల్ ఐసింగ్ చేస్తున్నట్లు ఆమె వివరించారు.
మూడు అంగుళాల భవనం ఆకృతితో మొదలు పెట్టిన ప్రాచీ.. ఇప్పుడు ఏకంగా పది అడుగుల పొడవు, 4.7 అడుగుల ఎత్తైన కేకులను వీగన్ ఐసింగ్‌తో రూపొందిస్తున్నారు. క్వీన్ ఆఫ్ రాయల్ ఐసింగ్ అని పిలిచేంతగా ప్రాచీ రాయల్ ఐసింగ్‌లో నైపుణ్యం సాధించారు.