Karimnagar Cable Bridge : కరీంనగర్ 'కేబుల్ బ్రిడ్జి' అందాలు అదరహో.. డ్రోన్ విజువల్స్ ఇదిగో..!
🎬 Watch Now: Feature Video
Karimnagar Cable Bridge Inauguration : ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల మధ్య ప్రయాణభారంతో పాటు ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి ప్రభుత్వం నిర్మించిన కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. సుమారు రూ.224కోట్ల వ్యయంతో కరీంనగర్లో నిర్మించిన ఈ తీగల వంతెనను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం రోజున ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. 2018 ఫిబ్రవరి 19న ఈ వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయగా.. రూ.183 కోట్ల వ్యయం అవుతుందన్న అంచనా వేశారు.
నిర్మాణంలో మార్పులు, భూసేకరణ తదితరాల కారణాలతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేసరికి వ్యయం 224 కోట్లకు చేరింది. ఈ వంతెన అందుబాటులోకి వస్తే.. జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, సిరిసిల్ల తదితర జిల్లాల నుంచి కరీంనగర్ మానేరు వంతెన రహదారి మీదుగా వరంగల్, విజయవాడకు వెళ్లే వారికి ప్రయాణ భారంతోపాటు, ట్రాఫిక్ రద్ధీ కూడా తగ్గనుంది. కేబుల్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా ఇప్పటికే తీగల వంతెన 500 మీటర్లు, కరీంనగర్ కమాన్ నుంచి వంతెన వరకు 300 మీటర్లు, సదాశివపల్లి వైపు 500 మీటర్ల దూరంలో రహదారి పనులు పూర్తి కాగా.. మిగిలిన 3.4 కిలోమీటర్ల వరకు భూసేకరణ చేసి అప్రోచ్ రోడ్లు నిర్మించారు.