kaleshwaram project water level : కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీ వరద.. పలు బ్యారేజీల గేట్లు ఎత్తి నీటి విడుదల
kaleshwaram project water level Today : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు, ఎగువ నుంచి వరద ప్రవాహం కలిసి.. కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తుతోంది. తెలంగాణ, మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో.. గత నాలుగు రోజులుగా పడుతున్న భారీ వర్షాలకు వరద వచ్చి చేరుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ బ్యారేజీకి ప్రాణహిత నుంచి 4,38,880 క్యూసెక్కుల మేర నీటి ప్రవాహం వస్తుంది. బ్యారేజీలో 85 గేట్లకు గానూ 57 గేట్లు ఎత్తి 4,85,030 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీలో 7.6 టీఎంసీల నీటినిల్వ క్రమంగా కొనసాగుతోంది.
రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వానలకు అన్నారం బ్యారేజీలో మొదటిసారిగా గేట్లు ఎత్తి.. నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బ్యారేజిలో 65 గేట్లకు గానూ 15 గేట్లు తెరిచి 18,900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అన్నారం బ్యారేజీకి 15,400 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. అన్నారంలో ప్రస్తుతం 8.10 టీఎంసీల నీటి నిల్వ చేరింది.