Gutha Comments on Haritha Haram : 'హరితహారం.. దేశానికే ఆదర్శం' - హరితహారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఎల్ రమణ
🎬 Watch Now: Feature Video

Haritha Haram at Telangana Assembly : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా హరితోత్సవం కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగుతోంది. ప్రజలు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. మంత్రులు ఎక్కడికక్కక కార్యక్రమాల్లో పాల్గొని మొక్కలు నాటుతూ.. స్థానికుల్లో ఉత్సాహం నింపుతున్నారు. కార్యక్రమంలో భాగంగా శాసనసభ ఆవరణలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్, డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ ఎల్.రమణ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మాట్లాడిన గుత్తా సుఖేందర్‌రెడ్డి.. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి తన ఇంటి వద్ద మొక్కను నాటుకోవాలనే ఆలోచనను కలిగించిన బృహత్తర కార్యక్రమం హరితహారమని కొనియాడారు. దాదాపు 57 కోట్ల మొక్కలు నాటి తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉందని వెల్లడించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో 7 శాతానికి పైగా గ్రీన్ కవర్ పెరగటం సంతృప్తి కరమన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన హరితహారం సత్ఫలితాలు ఇస్తోందన్న ఆయన.. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించటం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. గతంలో మొక్క నాటితే ఏమవుతుందని ప్రతిపక్షాలు ఎద్దేవా చేసిన హరితహారం కార్యక్రమం.. నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందని డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్ పేర్కొన్నారు.