5.5 కిలోల బంగారంతో ఆలయ శిఖరానికి తాపడం... రూ.16 కోట్ల ఖర్చుతో..
🎬 Watch Now: Feature Video
హిమాచల్‌ప్రదేశ్ బిలాస్‌పుర్ జిల్లాలో ఉన్న శ్రీ నైనాదేవి ఆలయ శిఖరానికి.. బంగారు తాపడం చేయించారు ఆలయ నిర్వహకులు. 51 శక్తిపీఠాల్లో ఒకటైన ఈ ఆలయ శిఖర తాపడానికి.. ఐదున్నర కేజీల బంగారాన్ని వినియోగించారు. 596 కేజీల రాగిని సైతం ఇందుకు ఉపయోగించారు. బంగారు తాపడానికి మొత్తం రూ.16 కోట్లు ఖర్చు చేసినట్లు ఆలయ కమిటీ వెల్లడించింది. మూడు నెలల పాటు నిర్మాణ పనులు జరిగాయని తెలిపింది.
"సోమవారం నాటికి పనులు పూర్తి కావడం వల్ల ఆలయంలో యజ్ఞం నిర్వహించాం. దిల్లీకి చెందిన ఓ సామాజిక సేవా సంస్థ సహాయంతో ఈ పనులు పూర్తి చేశాం. పనులు పూర్తి కావడానికి మొత్తం మూడు నెలల సమయం పట్టింది. 2023 జనవరి 16న పనులు మొదలుపెట్టాం. గుజరాత్, రాజస్థాన్‌కు చెందిన 50 మంది కార్మికులు ఇందులో పాల్గొన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా వారు పనిచేశారు" అని ఆలయ నిర్వహకులు తెలిపారు.
కొంతకాలం పంజాబ్‌కు చెందిన ఓ సామాజిక సేవ సంస్థ.. మూడు కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చిందని ఆలయ కమిటీ వెల్లడించింది. ఆ బంగారానికి మరికొంత స్వర్ణాన్ని జోడించి గర్భగుడికి తాపడం చేయించినట్లు ఆలయ కమిటీ వెల్లడించింది. బంగారు తాపడం కారణంగా ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతోందని భక్తులు చెబుతున్నారు. ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలతో భక్తుల తాకిడి పెరిగిందని అధికారులు చెబుతున్నారు. భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారు వెల్లడించారు. ఏటా లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అధికారులు పేర్కొన్నారు.